భోపాల్ : మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అగ్నిప్రమాదం నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ ప్రయివేటు బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరింది.
జాతీయ రహదారి 69పై బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు. ప్రయాణికులంతా వేగంగా బస్సులో నుంచి కిందకు దిగారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.