హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. అక్షరాలా రూ.12 వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ పోలీసులు, ఈగల్ బృందాల కండ్లుగప్పి.. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పక్క రాష్ట్రం పోలీసులు రట్టు చేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ (ఎంబీవీవీ) పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి ఆగస్టు 8న ముంబైలోని కాశీమిరా బస్‌స్టాప్ వద్ద ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా (23) అనే బంగ్లాదేశ్ మహిళ వద్ద 105 గ్రాముల మత్తు పదార్థమైన మెఫెడ్రోన్ (ఎండీ)లభించింది.
అదేరోజు ఆమెపై ఎన్డీపీఎస్ యాక్టులోని 8(సీ), 21(సీ), 22(సీ), 29 సెక్షన్లు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025లోని 3, 21 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరహా డ్రగ్‌పై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాది అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ అని వెల్లడైంది. ఆమె నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. ఆ నెట్వర్లో ఉన్న 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 178 గ్రాముల మెఫెడ్రోన్, రూ.23.97 లక్షల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ 10 మందిని తమదైన శైలిలో విచారించడంతో.. మెఫెడ్రోన్ అనే మాదకద్రవ్యాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినట్టు వెల్లడైంది.
ఈ కేసును ఎలాగైనా రహస్యంగా ఛేదించాలనే ఉద్దేశంతో ముంబై క్రైంబ్రాంచ్లోని క్రైమ్ డిటెక్షన్ యూనిట్, సెల్-4 ఇన్స్పెక్టర్ ప్రమోద్ బాదఖ్ తన బృందంతో తెలంగాణకు వచ్చారు. తమవద్దనున్న సమాచారంతో నగర సమీపంలోని చర్లపల్లిలో రహస్యంగా వివరాలు సేకరించారు. చర్లపల్లిలోని నవోదయ కాలనీ, ప్లాట్ నంబర్ 193, ఫేజ్ నంబర్ 5 వద్ద ‘వాగ్దేవి ల్యాబ్స్’ పేరుతో శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని సహచరుడు తానాజీ పండరీనాథ్ పట్వారీ మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారీ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ డ్రగ్ అంతర్జాతీయ మార్కెట్లో డ్రోన్, ఎం-క్యాట్, వైట్ మ్యాజిక్, మియావ్మియావ్, బబుల్ వంటి వివిధ పేర్లతో చలామణిలో ఉన్నది. మెఫెడ్రోన్, యాంఫెటమైన్, క్యాథినోన్ తరగతులకు చెందిన ఈ సింథటిక్ డ్రగ్‌ను వాడితే దాదాపు 24 గంటలపాటు మత్తు వదలదని చెప్తుంటారు. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించాలనుకున్న ముంబై పోలీసులు తమ బృందంలోని కొందరిని ఎంపిక చేసి.. ‘వాగ్దేవి ల్యాబ్స్’లో ఉద్యోగులుగా పంపారు. వారు ఉద్యోగులుగా నటిస్తూ.. అన్ని వివరాలు ఆరా తీశారు.
ఆ డ్రగ్స్ తయారు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని, నిర్వాహకులకు స్థానికంగా ఉన్న కొందరు పోలీసులు, ప్రభుత్వ పెద్దల సహకారం ఉన్నట్టు అనుమానించారు. కొన్ని వారాలపాటు రహస్యంగా ఈ ఆపరేషన్ కొనసాగించారు. ఈ క్రమంలో భారీగా మెఫెడ్రోన్ ముడి పదార్థాలు కంపెనీకి చేరుకున్న వెంటనే శుక్రవారం ఒక్కసారిగా దాడి చేసి, 32 వేల లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని సహచరుడు తానాజీ పండరీనాథ్ పట్వారీ వద్ద 5.790 కిలోల ఎండీ, అలాగే 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల పౌడర్, డ్రగ్ తయారీకి ఉపయోగించే ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన 5.790 కిలోల ఎండీ, ఇతర ముడి పదార్థాలతో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తయారు చేయవచ్చని అంచనా వేశారు. హైదరాబాద్‌లోని నిందితులిద్దరిని కలిపి మొత్తం 12 మందిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముడిపదార్థాలతోపాటు 27 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, ఒక బైక్, 4 ఎలక్ట్రిక్ కాంటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన వారిని మీరా-భయందర్, వసాయి-విరార్ (ఎంబీవీవీ) పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్, అడిషనల్ కమిషనర్ దత్తాత్రేయ్ షిండే, డిప్యూటీ కమిషనర్ సందీప్ డోయిఫోడ్, అసిస్టెంట్ కమిషనర్ మదన్ బల్లాల్ అభినందించారు.
ఎక్కడో మారుమూల పల్లెల్లో కాకుండా.. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చర్లపల్లిలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. నిత్యం గ్రాముల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్న ఈగల్ బృందం సైతం ఇంత భారీస్థాయిలో కిలోల లెక్కన, వేల లీటర్లలో డ్రగ్స్, ముడి పదార్థాలు దొరకడంతో కంగుతిన్నారు. ఇంత భారీస్థాయి నెట్‌వర్క్‌లో ఈగల్ పోలీసులు లేక స్థానిక పోలీసుల ప్రమేయం ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అక్రమ ఆయిల్ నిల్వలకు, డ్రగ్స్ తయారీకి, అక్రమ పాల వ్యాపారాలకు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చర్లపల్లి, చెంగిచెర్లలు అడ్డాగా మారాయి.
ఔటర్ లోపల ఇంత భారీగా అక్రమాలు జరుగుతున్నా పోలీసుల నిఘా ఎక్కడుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమంగా తయారైన డ్రగ్స్ బయటకు ఎలా వెళ్తున్నాయి? అనేది పోలీసులను తొలిచేస్తున్న ప్రశ్న. లోకల్ పోలీసుల అండదండలు, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉంటేనే ఇది సాధ్యమని పలువురు సీనియర్ ఆఫీసర్లు అంటున్నారు. ఏది ఏమైనా.. ఈ అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌పై తెలంగాణ ఈగల్ పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేసి, అక్రమాలకు సహకరిస్తున్న పోలీసులు, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో దేశంలోని తొలిసారిగా భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ విజయ్ ఐటీ నిపుణుడిగా ఉంటూ.. కెమికల్స్ గురించి తనకున్న జ్ఞానాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించారు. తన డ్రగ్ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో స్థానికంగా కొందరు కాంగ్రెస్ నాయకులు, పోలీసులను ఉపయోగించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సంకల్పించినా.. అందుకు తగ్గట్టు పోలీసుశాఖ పనిచేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర పోలీసులు సీక్రెట్‌గా నెల రోజులపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్‌తో రాచకొండ పోలీసులు ఉలిక్కిపడ్డారు. అన్నీ తెలిసే కోట్లలో వసూళ్లకు పాల్పడుతున్న వారంతా.. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇంత భారీస్థాయిలో డ్రగ్స్ అక్రమంగా సరఫరా అవుతుండటం.. స్థానిక పోలీసుల సహకారం లేనిదే జరగదని సీనియర్ అధికారులు అంటున్నారు.