వెంగళరావునగర్, జనవరి 3: బోగస్ కంపెనీ సృష్టించి పీఎఫ్ సంస్థకు టోకరా వేసి లక్షలు కాజేసిన కేటుగాడి ఉదంతమిది. కాగితాల్లోనే కంపెనీని సృష్టించి కార్మికుల పేరిట కేంద్ర ప్రభుత్వం చెల్లించే పీఎఫ్ డబ్బు స్వాహా చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..మధురానగర్ కాలనీలోని బీ బ్లాక్ -18 అనే చిరునామాతో ఎస్.కె.ఇంజినీర్స్ అనే బోగస్ కంపెనీని ప్రదీప్ కుమార్ సురపానీ అనే వ్యక్తి కాగితాల్లోనే సృష్టించాడు. ఈ కంపెనీలో కార్మికులు పని చేస్తున్నారని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి దరఖాస్తు చేశాడు.
అయితే కేంద్ర ప్రభుత్వం క్లిష్టమైన కరోనా లాంటి సమయంలో ఆదుకునేందుకు అక్టోబర్ 2020లో ఆత్మ నిర్భర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.15 వేల వేతనం కంటే తక్కువ ఉన్న వారికి కార్మికుల వేతనం నుంచి కాకుండా ఈపీఎఫ్ఓకు చెల్లించే డబ్బును కేంద్ర ప్రభుత్వమే ఈ పథకం కింద భరించింది. కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలుసుకున్న కేటుగాళ్లు ఈ మోసానికి తెర లేపారు. లేని కంపెనీని, కార్మికులను కాగితాల్లో సృష్టించి ఈపీఎఫ్ఓ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. ఈ పథకం కింద కార్మికుల తరపున చెల్లించాల్సిన 12 శాతం, అలాగే కంపెనీ పీఎఫ్ కార్యాలయానికి చెల్లించాల్సిన మరో 12 శాతం కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇది తెలుసుకున్న సదరు కంపెనీ నిర్వాహకుడు ప్రదీప్ కుమార్ పీఎఫ్ డబ్బును డ్రా చేసి స్వాహా చేశాడు. ఈ ఉదంతం పై ఢిల్లీలోని పీఎఫ్ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందడంతో ఈపీఎఫ్ఓ రీజనల్ కార్యాలయాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. కూకట్పల్లి ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.సుందర్రావు మధురానగర్లోని కంపెనీ కోసం వెళ్లగా బోగస్ అని తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జమ చేసిన రూ.29,81,505 పీఎఫ్ డబ్బును కాజేసిన సదరు కంపెనీ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.