పండుగ ఏదైనా పసందుగా మారాలంటే.. విందు ఘనంగా ఉండాలి. అన్ని పండుగ విందులూ ఆ రోజుకే పరిమితం అవుతాయి. సంక్రాంతి సంబురం మాత్రం పిండి వంటలతో మొదలై… నువ్వులుండలతో ముగుస్తుంది. బురబురలాడే సకినాలు.. కరకరలాడే మురుకులు.. మెలితిరిగి ఉన్నా నావే అనిపిస్తాయి. చేగోడీలకు జోడీగా అరిసెలు, జంతికలకు తోడుగా నువ్వుల ఉండలు.. ఇంపైన మేళవింపు. ఇక గర్జెలు తిన్నవాడు ఆర్జించే సంతోషం అంతా ఇంతా ఉండదు. అనాదిగా సంక్రాంతి వేళ ఫలానా పదార్థాలు తినాలని మన పెద్దలు ఆచరించి, శాసించారు. పాకశాస్త్ర శాసనాల గ్రంథాన్ని అనుసరించి చేసుకునే ఈ సంప్రదాయ వంటకాల తయారీలో ఓ సమష్టితత్వం కనిపిస్తుంది.

ఆరగించడంలో మాత్రం తిండిపుష్టి కలవాడిదే పైచేయి అవుతుంది. ఎవరి అభి‘రుచి’ వారిదనుకోండి! ఆబగా లాగించినా, కొసరి కొసరి ఆరగించినా.. సంక్రాంతి పిండివంటలన్నీ ఆరోగ్య ప్రసాదాలే! తిన్నకొద్దీ రుచి హెచ్చుతుంది. అదనంగా ఆరోగ్యం దక్కుతుంది. వీటి రుచి మాత్రమే కాదు.. ఈ పదార్థాలను వండి వడ్డించడంలోనూ ఓ కళ ఉంది. మూకుడు సిద్ధం చేయడానికి ముందు.. ఆ ముచ్చట్లు ఆరగించండి మరి.
సిరులొలికించే పండుగ సంక్రాంతి.
మమతలు విరిసే పండుగ కూడా ఇదే!
వినువీధుల్లో గాలిపటాల హోరు..
వీధిగుమ్మాల్లో ముగ్గుల జోరు..

అన్నిటికీ మించి చలి గుప్పే మౌసమ్లో సంక్రాంతి సెలవులు.. కోరుకున్నవారికి కావాల్సినంత విశ్రాంతిని ప్రసాదిస్తాయి. పండుగ వేళకు సిద్ధమయ్యే పిండివంటలు అంతకుమించిన ఆనందాన్నిస్తాయి.
మూకుడుకు కూడా ముహూర్తం చూసుకునే పండుగ సంక్రాంతి ఒక్కటే కావొచ్చు!
ఈ పండుగ స్పెషల్స్‌లో సకినాల సందడి తర్వాతే మరేదైనా! వరిపిండి, ఓమా, నువ్వులు ఇవే ముడిపదార్థాలు. చక్కగా చుట్టేసి మూకుట్లో వేయిస్తే.. సకినాలు సిద్ధం. మరీ ఇంత తేలికా! అనుకోకండి.
సకినాల పిండి కలపడం ఒక కళ అయితే.. వాటిని చుట్టడం బ్రహ్మవిద్యే! అది అన్ని చేతులకూ చిక్కదు. ఎన్ని మెలికలు తిప్పామన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అరచేతిలో పిండిని ఎంత కోమలంగా పట్టుకున్నామన్నది ఇంపార్టెంట్. పిండిముద్దను మూడువేళ్ల మధ్యగా బుజ్జగిస్తున్నట్టు జారవిడుస్తూ, మణికట్టుతో మాయాజాలం చేస్తూ.. వస్త్రంపై సకినం చుట్టాలి. పొందికగా అల్లుతూ, పద్ధతిగా చుట్టాలి. ఇలా చుట్టడంలో పట్టున్న పెద్దమ్మకు సంక్రాంతి సమయంలో తీరిక ఉండదు. వాడకట్టంతా ఆమె జాడ కోసం ఎదురుచూస్తుంటుంది. ఆమె అనుగ్రహం కోసం పడిగాపులు కాస్తుంటారు జనాలు. పెద్దమ్మకు తీరిక ఉన్న రోజునే మూకుడు పెట్టుకుంటామని బతిమాలుకుంటారు. ‘మీ ఇంట్లో మూకుడున్న రోజు.. మేమంతా సాయంగా వస్తామ’ని మాటిస్తారు. ‘ఇంట్లో పని ముగించుకున్న తర్వాత వస్తాలే!’ అని ఆమె అన్నదో లేదో.. దణ్నం పెట్టేసి.. పిండి సిద్ధం చేయడానికి పొలోమని వెళ్లిపోతారు.
ఆ పెద్దమ్మ రావడంతోనే.. అంతా అలెర్ట్ అవుతారు. ఆ కళ గల మనిషి… పాత సినిమాల్లో అన్నపూర్ణమ్మ టైపు మెత్తటి మనస్తత్వం ఉన్నదైతే, వీళ్లకు పెద్ద రిలీఫ్. ఎన్నైనా తిప్పించుకోవచ్చు. పనిలో పనిగా ఆమెను ప్రసన్నం చేసుకొని సకినాలు చుట్టడం నేర్చుకోవచ్చు. ఆ వచ్చిన వ్యక్తి సూర్యకాంతం టైప్ అయితే.. చుట్టు చుట్టుకో తిట్టు తిట్టడం ఖాయం. అయినా.. అవేం పట్టించుకోరు! ఆ చుట్టే ఆవిడ తిట్టేసి ఊరుకుంటుందా! ఇటు చుడుతూనే… అటు మూకుడు ఆడిస్తున్న ఇంటి యజమానురాలిని ఇక్కణ్నుంచే శాసిస్తుంటుంది. నూనె సెగ ఎక్కువైందని ఒకసారి, తక్కువైందని మరోసారి, అంతగా ఆడించొద్దని ఇంకోసారి.. ఇలాగన్నమాట! బురబురలాడే సకినాల కోసం.. ఎన్ని శకునాలైనా తట్టుకోకతప్పదు మరి! సకినాల పర్వం సజావుగా ముగిస్తే అదే పదివేలు.
సకినాలు మూకుడు నుంచి దించగానే.. కాస్త దోరగా, ఇంకాస్త మెత్తగా కటుకులా మారాయేమో అని దడ పుట్టిస్తాయి. కాస్త వేడి చల్లారాక గానీ, అసలు బురబురలు మొదలుకావు. బోల్డ్‌గా చుట్టేస్తే బోలుగా వస్తాయనుకుంటే పొరపాటు. అలాగని పీలగా చుడితే.. అసలుకే ఎసరొస్తుంది. అతి మందం కాకుండా, మరీ మంద్రంగా కాకుండా… ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగంలా కరాగ్రం నుంచి పిండిముద్ద ముద్దుగా దిగాలి. ఆ రాగంలోని ఐదు స్వరాల్లా ఐదు చుట్లు లయ తప్పకుండా శ్రుతిలో తిప్పాలి. అప్పుడు.. అదే రాగంలో అన్నమయ్య కట్టిన అదివో అల్లదివో శ్రీహరివాసం కీర్తనంత గొప్పగా సకినాలు సిద్ధమవుతాయి.
తయారీ సంగతి సరే! సకినం తినడం కూడా కళాత్మకంగా సాగాలి! కర్రీపఫ్ తినేసినట్టు, పావ్‌బాజీ లాగించినట్టు ఆబగా తింటే.. ప్రయోజకత్వం అనిపించుకోదు. బురబురలాడే సకినం తింటుంటే.. అందులో ఎక్కడో దాక్కున్న నువ్వు గింజ కూడా మన పంటికింద నలగాలి. ఓమా ఫ్లేవర్‌ను ఆస్వాదించగలగాలి. నాలుగు సార్లు నమిలేసి.. మింగేస్తానంటే కుదరదు. చారు మరిగే కొద్దీ మెరుగవుతుంది. సకినం నమిలేకొద్దీ రుచినిస్తుంది. దంతాలకు వ్యాయామం అనుకోండి. ఆవు నెమరువేస్తుంది చూశారు.. అలా, ఒక్కో సకినం ఐదు నిమిషాలైనా అలా అలా ఆరగించాలన్నమాట! అప్పుడు ఉంటుంది చూడండి.. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి అన్నట్టు ‘ఆహా! నా రాజా!!’ అనాలనిపిస్తుంది.
అంతగా చేసుకొని, వింతగా తిన్నాం సరే.. ‘ఐతే మాకేంటి?’ అంటారా!! ఆ మాటకొస్తే.. జిహ్వ చాపల్యం తీరితే చాలదా చెప్పండి. సకినం కేవలం రుచిని పంచే పదార్థం మాత్రమే కాదు. ఇందులోని ఓమా జీర్ణశక్తిని పెంచుతుంది. నోట్లో వికారాలను తరిమికొడుతుంది. ఇక నువ్వులంటారా.. ఒంట్లో వేడి పుట్టిస్తుంది. కీళ్లలో గుజ్జుకు గ్రీజు పూస్తుంది. ఇంతటి మేలు చేసే పిండి వంటకం మరొకటి ఉండదేమో! ఉన్నా అది కచ్చితంగా సంక్రాంతికి వండుకునే వాటిల్లోనే ఉండి తీరుతుంది.

సకినాల తంతు ముగిసింది.. ఇక అరిసెల పర్వంలోకి ప్రవేశిద్దాం. విస్తట్లో ఉదయ భానుడిలా ఉంటుంది అరిసె. కానివారికి కంచాల్లో వడ్డించినా… అరిసె దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తారంతా! భోజనం కంచంలో వడ్డిస్తేనేం.. విస్తట్లో పెడితేనేం.. వడ్డనలో అరిసె ఉందంటే, మీరు ఆ ఇంటికి పక్కా అయినవారి కిందికే లెక్క! అట్లుంటది మరి ఈ తీపి పదార్థంతో!! వరిపిండి, బెల్లం ఎంతగా కలగలిస్తే… అరిసె రుచి అంతగా వెల్లివిరుస్తుందన్నమాట! అరిసెలు చేయడం కూడా ఆర్టే! దొడ్డు బియ్యం నానబెట్టి, కాస్త ఆరనివ్వాలి. బియ్యం పులి పచ్చి మీద ఉన్నప్పుడే గిర్నీలో స్పెషల్‌గా పిండి పట్టించాలి.
ఈ పిండికి ముందు ఏ పిండి పట్టారో.. గిర్నీవాణ్ని గిరిగీసి అడగాలి. కాకమ్మ కథలు చెబుతున్నట్టు అనిపిస్తే.. బరిలోకి దిగైనా, వెంట తీసుకెళ్లిన సాదా బియ్యం పట్టివ్వమనాలి. ఆ బియ్యప్పిండి వృథాగా పోదు… చేగోడీలు, జంతికలకు ఆ పిండిని వాడేస్తే సరి! పౌష్య పున్నమి రేయిలో నింగి రేడును అల్లుకున్న మంచు తెరలంత లలితంగా తడిపొడిగా అరిసెల పిండి ఉండాలన్నమాట. ఆ పిండి నుంచి తడి ఇగిరిపోక ముందే.. బెల్లం పాకంలో వేసేయాలి.
ఈ బెల్లం పాకం ఎలా ఉండాలంటే… కాస్త పాకం తీసి, నీళ్లల్లో వేస్తే దగ్గరగా వచ్చి, మెత్తగా వేళ్లకు హత్తుకుపోవాలన్నమాట. అలా పిండి పాకంలో వేసి కలియగలిపి.. పూరీ పిండంత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అందులోంచి సుతారంగా కొంత పిండి ముద్దను తీసుకొని.. పసిపాప నెత్తిని నూనెతో అంటినట్టు… సుతిమెత్తగా ఒత్తుకోవాలి. పరిమాణం మీ అరచేయంత ఉంటే బేషుగ్గా ఉంటాయి. అలా ఒత్తుకున్న అరిసెను… అనల తల్పమైన నేతిలో (నూనెలో) వేసుకొని, దోరగా వేయించుకుంటే.. అరిసె కాస్త పొంగుతుంది.
ఆ పొంగిన దాన్ని రెండు అరిసె పీటల మధ్య ఉంచి నిదానంగా ఒత్తుకోవాలి. పదార్థాన్ని పట్టుకున్న తైలం జారిపోయి… మురిసిపోయేలా అరిసె తయారవుతుంది. దీన్ని నువ్వుల్లో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాకయాగంలో కాస్త తేడా జరిగినా.. నూనెలో వేయగానే అరిసె ముక్కలు చెక్కలుగా విరిగిపోతుంది. అక్కడ మిస్సయినా… తీరా తిందామని నోట్లో పెట్టుకునే సరికి, బిళ్లప్పల్లా కటుకుమంటాయి. అలా కాకుండా.. ఇలా నోట్లో పెట్టగానే, సుతారంగా నమిలేటట్టు, నోట్లో పాకం ఊరేటట్టు తయారైతే.. అరిసె తిన్నవాళ్లకు తియ్యటి వేడుక చేసుకున్నామన్న అనుభూతి దక్కుతుంది. చేసిన వాళ్లకు అపారమైన కీర్తి మిగులుతుంది.

మురుకులు, చేగోడీలు, జంతికలు.. ఒక అర్థానికి ప్రతిపదార్థాలు ఉన్నట్టు.. ఒకే పదార్థానికి రూపాంతరాలు ఇవి. రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కటే అన్నట్టు.. వీటి రూపాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. పంచే రుచి మాత్రం ఇంచుమించు ఒకటే! వరిపిండిలో కాస్త ఉప్పు, కారంపొడి, కొన్ని నువ్వులు, ఓమా వేసుకొని, వేడి నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. వీటిలో చేగోడీల తయారీ ఆసక్తికరంగా సాగుతుంది. కాస్త గట్టిగా కలుపుకొన్న పిండి ముద్దను ఇంత తీసుకొని… ఓ పీట మీదో, నున్నటి బండ మీదో.. చేతులతో లట్టడిగలా తిప్పుతూ పొడవాటి దండంలా తయారు చేస్తారు. దీనిని పద్ధతిగా సర్పిలాకారంలో చుట్టి.. నూనెలో వేయిస్తారు. ఈ పిండి చుట్టే క్రతువు పిల్లలతో సందడిగా సాగితే.. పదార్థానికి మరింత రుచి చేకూరుతుంది. పండుగకు ఇంటికి వచ్చిన పిల్లలకు తలా ఇంత పిండి ముద్ద ఇచ్చి.. చేగోడీలు చుట్టివ్వమంటే, ఉత్సాహంగా పనిలో మగ్నమవుతారు.
అది పిల్లలకు ఆటవిడుపు. పెద్దలకు పనిభారం కుదింపు. పిండిని తిప్పేటప్పుడు బలమంతా ప్రయోగించొద్దు. ఒత్తీవత్తకుండా.. మెత్తగా పని కానివ్వాలన్నమాట! అప్పుడే కరకరలాడుతాయి. మురుకుల ముచ్చట భలేగా ఉంటుంది. ఇదే వరిపిండి.. చేగోడీల పిండి కన్నా, ఇంకాస్త మెత్తగా కలుపుకొని, చేగోడీల పావులో పెట్టి ఒత్తుకుంటే సరి! ముళ్లు పరుచున్నట్టుండే.. మురుకులు, కాలక్షేపంగా అయినా పదికి తక్కువ లాగించం. జంతికల పిండి చేగోడీల పిండి కన్నా ఇంకాస్త మెత్తగా చేసుకోని.. పావులో దొడ్డు సేగు (లావు కారప్పూస) ప్లేటు పెట్టుకొని మూకుట్లో ఒత్తుకుంటే సరి. అయితే, మురుకులు, చేగోడీలు, జంతికలు.. కరకరలాడాలంటే, పిండి కలిపేటప్పుడు తగినంత వెన్నపూస కలుపుకొంటే మంచిది. ఇలా చేస్తే అదనపు రుచి కూడా సంతరించుకుంటాయి.

సంక్రాంతి పండుగలో కన్నడ సీమలో నువ్వుల లడ్డూలు చేసుకునే సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. అదే ఆచారం తరాలుగా మన ప్రాంతీయులూ పాటిస్తూ ఉన్నారు. సంక్రాంతి నోములు నోచుకునే వారు.. ఇచ్చే వాయనంలో నువ్వుల ఉండలు ప్రత్యేకం! నువ్వులు, బెల్లంతో చేసే ఈ తీపి పదార్థం దంతాలకు పరీక్ష పెట్టినా.. జిహ్వకు పండుగ చేయాలి. దంతాలతో వర్కవుట్ చేయించాలే గానీ, కటుక్కున కొరకగానే పుటుక్కున విరిగేంత ద్రోహం తలపెట్టొద్దు. అలా కావొద్దంటే.. పాకం పర్ఫెక్ట్గా కుదరాలి. ముందుగా నువ్వులు శుభ్రంగా కడిగి లేత ఎండకు ఆరబెట్టుకోవాలి. ఆపై మందంపాటి గిన్నెలో వేసి చక్కగా వేయించుకోవాలి.
అలా వేగుతూ చిటపటలాడుతున్న నువ్వుల సందడి వినసొంపుగా ఉంటుంది. ఆ సమయంలో వెదజల్లే పరిమళం.. ఇల్లంతా వ్యాపించి, పక్కింటి వాళ్లకు కూడా.. తీపి కబురు అందిస్తాయి. ఇక నువ్వుల లడ్డూల పాకం కట్టడం అంటే సాదాసీదా వ్యవహారం కాదు. పంటి సత్తువ ఉన్నవాళ్లు… కటుకు బెల్లంతో పాకం కట్టుకుంటే నువ్వుల లడ్డూల రుచి పదింతలు పెరుగుతుంది. రెగ్యులర్ బెల్లం పాకమైనా ఫర్వాలేదు! ఏ బెల్లం అయినా.. పాకం సకాలంలో పొయ్యి దించాలి. లేకపోతే బెల్లంతో నువ్వులకు గొడవైపోతుంది. ఉండలు తిన్నప్పుడు దంతాలకు ఉండేలు దెబ్బ తగిలినంత పని అవుతుంది. ఇంతకీ పాకం పక్వానికి వచ్చిందని తేల్చుకునేందుకు పెద్దలు ఓ శ్రావ్యమైన సూత్రం కనిపెట్టారు.
పాకం పట్టిందని గ్రహించగానే.. ఇంత తీసి నీళ్లల్లో వేయాలి. దాన్ని పిల్లలు ఆడుకునే గోళీలా చుట్టి.. బోర్లించిన తాంబాలానికో, స్టీలు ప్లేటుకో.. గిరాటెయ్యాలి. అప్పుడు కంగుమని వినసొంపైన ధ్వని పుడితే.. పాకం సిద్ధమైనట్టు. అప్పుడు నువ్వులు పాకంలో వేసి.. బాగా కలగలిపి, వేడి మీద ఉండగానే.. లడ్డూలు చుట్టుకోవాలి. వేడి తాకి అరచేయి సుర్ర్.్ర. మనకుండా నీళ్లు అద్దుకుంటూ ఉండాలి. ఎంత వేగంగా చుడితే అంత చక్కగా కుదురుతాయి. చివరికి వచ్చేసరికి పాకం బిగుసుకుపోతుంది. మళ్లీ సన్నటి సెగ తాకిస్తే.. పాకం మెత్తబడి లడ్డూలు చుట్టుకోవడానికి అనుకూలం అవుతుంది. ఈ నువ్వుల లడ్డూల్లో.. వేయించిన పల్లీలు, పుట్నాలు కూడా వేసుకుంటారు కొందరు. ఎలా చేసుకున్నా.. రుచి గ్యారెంటీ. ఆరోగ్యం డబుల్ గ్యారెంటీ!!

అప్పాల గురించి ప్రతేకంగా చెప్పాలా చెప్పండి! బిళ్లలు, అప్పాలు, చెక్కలు ఏ పేరున పిలిచినా… అరచేతిలో ఇమిడిపోయే ఘాటైన పదార్థం కంటికి సొంపుగా, పంటికి ఇంపుగా తోస్తుంది. వరిపిండితో చేసే అప్పాలను ఎవరికి నచ్చినట్టు వాళ్లు చేసుకుంటారు. కొందరు శనగపప్పు దట్టించి చేసుకుంటే, ఇంకొందరు పల్లీలు వేసి కూడా ఒత్తుకుంటారు. ఉల్లిపొరకతో కలిపి కొందరు చేసుకుంటే, పెసరపప్పు దట్టించి వేయించుకునేవాళ్లు ఇంకొందరు.
ఏ తీరుగా చేసుకున్నా.. వీటి రుచి అద్భుతం. బిళ్లలు ఒత్తుకొనే యంత్రం ఇప్పుడైతే వచ్చింది కానీ, వందలకొద్దీ అప్పాలు చేతులతో ఒత్తి చేసేవారి చేతులకు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే! అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు, గర్జెలు రాజ్యమేలే సంక్రాంతి రోజుల్లో అప్పాలను అంతగా పట్టించుకోరు! కానీ, పండుగ పిండి వంటలు నిండుకుంటున్న తరుణంలో అప్పాలకు డిమాండ్ పెరుగుతుంది. వాటి ప్రాధాన్యం అప్పుడు తెలిసొస్తుంది.

సంక్రాంతి పిండివంటల్లో గర్జెలు.. అనగా కరియలు ఎలా దూరాయో ఓ పట్టాన అర్థం కాదు. ఇందులో వరిపిండికి వాడరు. నువ్వులకూ చోటు దక్కలేదు. అయినా, పండుగ నాటికి గర్జెలూ సిద్ధమైపోతాయి. గోధుమ/ మైదా పిండిని మెత్తగా తడిపి, పూరీల్లా ఒత్తుకొని, దానిపై తియ్యటి స్టఫ్ పెట్టేసి.. అందంగా అర్ధచంద్రాకృతిలో మూసేస్తారు. స్టఫ్‌గా కొందరు కొబ్బరిపొడి, పల్లీలపొడి, చక్కెర పొడి కలుపుకొంటే, కొందరు బెల్లంపొడి, పల్లీల పొడితో పనికానిచ్చేస్తారు. కాస్త రుచుల మీద మక్కువ ఉన్నవాళ్లు కోవా, బెల్లం/ చక్కెర కలిపి స్టఫ్‌గా వాడుతారు. ఏది ఎంచుకున్నా.. గర్జెలు పక్కా తీపి పదార్థం. ఆరోగ్యానికీ మేలు చేసేవే!!
ఇవండీ! సంక్రాంతి పిండి వంటల విశేషాలు. చేసే పద్ధతులు కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, ప్రాంతాలను బట్టీ మారుతుంటాయి. పైపై మెరుగులు మారినా.. మూల పదార్థం అస్తిత్వం మారదు. రుచిలో హెచ్చుతగ్గులు ఉన్నా… అవి అందించే ఆరోగ్యంలో మాత్రం తేడా రాదు. ఎందుకు ఆలస్యం.. దూకుడుగా మూకుడు పెట్టేయండి. సకినాలతో మొదలుపెట్టి.. గర్జెలతో గర్జించండి. తీపి, కారాల పిండివంటలతో మూడు రోజులు సంక్రాంతి పండుగను ముచ్చటగా సెలెబ్రేట్ చేసుకోండి. ఇవే కాకుండా వేరే సంప్రదాయ వంటకాలేమన్నా గుర్తుకువస్తున్నాయా! మరేం ఫర్వాలేదు. వాటన్నింటి వెనుకా ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఇమిడే ఉంటుంది.

సంక్రాంతినాడు నువ్వులు తినాలని పెద్దలు చెబుతుంటారు. మనవైపు ఎలాగూ నువ్వులతో అరిసెలూ, సకినాలు చేసుకుంటాం కాబట్టి ఫర్వాలేదు. ఇతర రాష్ర్టాలలో అయితే కేవలం నువ్వులతోనే పిండివంటలు చేసుకునే సంప్రదాయం ఉంది. బీహార్‌లో తిల్వా, గుజరాత్లో నువ్వుల చిక్కీలు, మహారాష్ట్రలో తిల్గుల్, రాజస్థాన్‌లో తిల్గడ్.. ఇలా దేశమంతటా ఏదో ఒక పేరుతో నువ్వులతో చేసిన తీపిపదార్థాన్ని తింటారు. ఇక కర్ణాటకలో అయితే ఏకంగా నువ్వుల ఉండలని ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వులు నిజంగా గొప్ప బలవర్ధకాలు.
100 గ్రాముల నువ్వులు తింటే 500కి పైగా కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. నువ్వుల నుంచి నూనెని తీసేసిన పిండిలో కూడా 50 శాతం వరకూ ప్రొటీన్లు, మాంసకృత్తులు మిగులుతాయి. అందుకనే ఈ పిండిని పారేయకుండా పశువులకి అందిస్తారు. ఇంత శక్తిమంతమైన ఆహారం కనుక నువ్వులు వేడి చేస్తాయి. అందుకని ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మళ్లే సంక్రాంతి సందర్భంలో వీటిని తీసుకోవాలని చెబుతారు. ఆ కాలంలో తీవ్రంగా ఉండే చలిబారి నుంచి ఈ నువ్వులు కాపాడటమే కాకుండా, వాతావరణంలో మొదలవబోతున్న అధిక ఉష్ణోగ్రతలకి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేస్తాయి.

సంక్రాంతికి కొత్త బియ్యం, కొత్త బెల్లాలతో అరిసెలు, పరమాన్నం చేసుకోమని సూచిస్తుంటారు. ఈ సంప్రదాయం కేవలం తెలుగు, తమిళనాడులోనే కాదు పశ్చిమబెంగాల్ వంటి ఉత్తరాది రాష్ర్టాలలో కూడా కనిపిస్తుంది. కాకపోతే బెంగాల్లో చేసుకునే పిండివంటని ఖజూర్‌గుర్ అంటారు. కొత్త బియ్యంతో అన్నం వండుకుంటే కడుపులో నొప్పి వస్తుంది. అందుకని దీనికి బెల్లాన్ని జోడించి అరిసెలనో, పాలని జోడించి పరమాన్నమో, కారాన్ని జోడించి సకినాలనో, చింతపండుని జోడించి పులిహోరనో చేసుకుంటారు. ఈ పదార్థాలన్నీ శరీరానికి బలాన్నిస్తాయే కానీ అజీర్ణం చేయవు.

కనుమనాడు మినుములు తినాలని ఓ సామెత. అందుకే వీటితో వడలు చేసుకుని తింటుంటారు. నువ్వులలాగానే మినుములు కూడా వేడి చేస్తాయి. అధిక శక్తినీ అందిస్తాయి. మినుములలో కూడా ప్రొటీన్లు, మాంసకృత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అత్యధికంగా కనిపించడం ఓ విశేషం. ఇవి కండరాల బలానికీ, ధాతుపుష్టికీ ఉపయోగపడతాయి. మినుములు తినడం వల్ల సంతానలేమి సమస్యలు దూరమవుతాయి. సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం కల్యాణ సమయం. ఆ కాలంనాటికి ఇంటి పిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మినుములు ఉపయోగమే! మగవారు రాబోయే పొలం పనులకు సిద్ధంగా ఉండాలన్నా, ఆడవారు ఇంటిపనులను చకచకా నిర్వహించుకోవాలన్నా తగిన సత్తువని అందించేది మినుములే.
– త్రిగుళ్ల నాగరాజు