వివాదాస్పద వెబ్‌సిరీస్ ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జీ5 ఓటీటీలో ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కావాల్సివుంది. గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని కీర్తిస్తూ, యువతను తప్పుదారి పట్టించే అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారని పంజాబ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని పంజాబ్ పోలీసులు కేంద్రానికి లేఖను కూడా రాశారు. లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని స్వీకరించిన పంజాబ్, హర్యానా హైకోర్టులు ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశాయి.
జైలు శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. 1998 కృష్ణ జింకల వేట కేసులో నటుడు సల్మాన్‌ఖాన్‌ను అంతమొందిస్తానని బెదిరిస్తూ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు లారెన్స్ బిష్ణోయ్. ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ సిరీస్ పంజాబ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, నేర సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని పంజాబ్‌లోని పలు ప్రజాసంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పూర్తిగా నిషేధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.