Gauri Khan | షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ (Gauri Khan) అందరికీ పరిచతమే. తను ఓ మంచి ఇంటీరియర్ డిజైనర్. ఖరీదైన ఇళ్లు, ఆఫీసులు, రెస్టారెంట్లకు ఘనంగా డిజైనింగ్ చేస్తారు. ఇటీవలే గౌరీ ఖాన్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘టోరి’ (Torii) పేరుతో ఓ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఈ రెస్టారెంట్ ఉంది. ప్రస్తుతం ఈరెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. ఆ హోటల్లో సర్వ్ చేస్తున్న పనీర్ ఒరిజినల్ కాదని.. అది ఫేక్ పనీర్ (fake paneer) అంటూ ఓ యూట్యూబర్ ఆరోపించారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , యూట్యూబర్ సార్థక్ సచ్‌దేవా (Sarthak Sachdeva) తరచూ సెలబ్రిటీలకు చెందిన రెస్టారెంట్లకు వెళ్తుంటారు. అక్కడి ఫుడ్‌ని టేస్ట్ చేసి రివ్యూస్ ఇస్తుంటారు. ఇలా గౌరీ ఖాన్‌కు చెందిన టోరి రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాడు. అందులోని పనీర్ ముక్కను కాస్త పక్కకు తీసి టెస్ట్ చేశాడు. దానికి అయోడిన్ టింక్చర్ (iodine tincture) పరీక్ష చేశాడు. అయోడిన్ వేయగానే పనీర్ ముక్క రంగు నలుపు నీలం రంగులోకి మారిపోయింది. దీంతో అతను షాక్ అయ్యాడు. ఇది నకిలీకి సూచికం అంటూ పేర్కొన్నాడు. ‘షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రెస్టారెంట్లో వడ్డించే పనీర్ నకిలీదని తేలింది’ అంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం కాస్తా చర్చకు దారి తీసింది.
అంతకుముందు సచ్‌దేవా.. పలువురు సెలబ్రిటీల రెస్టారెంట్లకు కూడా వెళ్లాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్, శిల్పా శెట్టి బాస్టియన్, బాబీ డియోల్ సమ్‌ప్లేస్ ఎల్స్కు వెళ్లి.. అక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేశాడు. ఆ మూడు రెస్టారెంట్లలో వడ్డించిన పనీర్‌కు ప్యూరిటీ టెస్ట్ కూడా చేశాడు. అయితే, గౌరీఖాన్ రెస్టారెంట్లో పనీర్ మాత్రం ప్యూరిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. దీంతో టోరిలో వడ్డించే పనీర్ నకిలీదని అతను పేర్కొన్నాడు.
యూట్యూబర్ ఆరోపణలపై టోరి యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు సచ్‌దేవా ఆరోపణలను తోసిపుచ్చింది. అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది తప్ప పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదు అంటూ వివరణ ఇచ్చింది. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నందు వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అంతేతప్ప, అది నకిలీదికాదని స్పష్టతనిచ్చింది. తమ పనీర్ చాలా స్వచ్చమైందనీ, టోరీలో వడ్డించే పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది. నకిలీ పనీర్ వడ్డిస్తున్నారనే వార్త విని ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం.. బాంద్రాలో గౌరీఖాన్ టోరి రెస్టారెంట్ ఉంది. నాలుగున్నర వేల చదరపు అడుగుల సువిశాల ఆవరణలో ఒకేసారి ఎనభై మంది కూర్చునేలా దీన్ని రూపొందించారు. రెస్టారెంట్ ఆవరణను తన స్వహస్తాలతో డిజైన్ చేశారు గౌరీ ఖాన్. మారియట్ లాంటి పేరున్న హోటల్స్‌లో పనిచేసిన స్టీఫెన్ చీఫ్ చెఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారతీయ, పాశ్చాత్య రుచుల మేళవింపుతో వంటకాలు ఇందులో వడ్డిస్తున్నారు. ధరలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయని టాక్. సాయంత్రం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ రెస్టారెంట్ నడుస్తుంది.
Also Read..
Vincy Aloshious | సెట్లో అసభ్యకరప్రవర్తన.. ‘దసరా’ విలన్‌పై మలయాళ నటి విన్సీ ఫిర్యాదు
Kerala State Film Awards | కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్
Lavanya | నార్సింగి పోలీసులను ఆశ్రయించిన లావణ్య