పెద్దపల్లి, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ క్రీడా యవనికపై తెలంగాణ కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. కెనడా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత స్వర్ణంతో కొత్త చరిత్రను సృష్టించింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా పరిగణించే ఈ పోటీల్లో చికిత.. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో చికిత.. 142-136తో కొరియా షూటర్ యెరిన్ పార్క్‌ను చిత్తు చేసి గోల్డ్‌మెడల్‌ను ముద్దాడింది.
యూత్ వరల్డ్ చాంపియన్షిప్స్లోని ఈ విభాగంలో భారత్ స్వర్ణం గెలవడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఆరంభ రౌండ్ నుంచి అద్భుత ప్రదర్శనతో రాణించిన ఈ పెద్దపల్లి అమ్మాయి.. క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన పరిణీత్ కౌర్‌ను ఓడించగా సెమీస్‌లో స్పెయిన్ షూటర్ పౌలా డియాజ్ మొరిల్లాస్ను మట్టికరిపించింది. ఇక ఫైనల్లో చెక్కుచెదరని గురితో పతకం సాధించి కొత్త రికార్డును లిఖించింది. గత మేలో చైనా వేదికగా జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-2లో జ్యోతి సురేఖ, మధురతో కలిసి టీం సిల్వర్ మెడల్‌ను సాధించిన చికిత.. తాజాగా వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడంతో ఆమె దాదాపుగా 20వ ర్యాంకుకు ఎగబాకనుంది. చికిత గోల్డ్ మెడల్ సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్చరీ యూత్ 2025 ఛాంపియన్ షిప్ అండర్ 21 విభాగం లో విజేతగా నిలిచిన చికితకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఎక్స్ ద్వారా తన అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో భారత దేశానికి తొలిసారిగా స్వర్ణం సాధించి, దేశమే గర్వపడేలా చేసిన ఆమెను కొనియాడారు.