Tamannaah Bhatia | తమన్నా భాటియా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీ, హ్యాపీడేస్‌లాంటి చిన్న సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే బడా హీరోలందరితో నటించి అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. దశాబ్దంపైగా దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలు, అభినయంతో మెప్పించింది ఈ మిల్కీ బ్యూటీ. కొంతకాలంగా దక్షిణాదిలో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపించింది. తాజాగా తన కెరీర్లోనే తొలిసారిగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రముఖ హారర్ బోల్డ్ ఫ్రాంచైజీ ‘రాగిణి MMS’ సిరీస్‌లో హీరోయిన్గా ఎంపికైందని సమాచారం. ఫిలీం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం.. ఈ హారర్-థ్రిల్లర్ ప్రాజెక్ట్ కోసం ‘ఏక్తా కపూర్’ స్వయంగా తమన్నాను సంప్రదించారట. కథ, పాత్ర, అన్నీ విన్న తర్వాత తమన్నా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
ఈ పాత్రలో కొంత బోల్డ్ కంటెంట్ ఉండబోతుందని.. తమన్నా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తున్నది. ‘జైలర్’లోని ప్రత్యేక గీతం ద్వారా మాస్ అటెన్షన్ అందుకున్న మిల్కీ బ్యూటీ.. ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ పాత్రతో అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా ‘రాగిణి MMS 3’ వంటి హార్డ్‌కోర్ హారర్-గ్లామర్ ప్రాజెక్ట్‌ను ఒప్పుకోవడం కెరీర్‌ను మలుపుతిప్పే సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొంటున్నారు. ఇంతకు ముందు రాగిణి సిరీస్‌లో సన్నీ లియోని నటించింది. ఇందులో సన్నీ నటనతో పాటు ‘బేబీ డాల్’ పాట సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో తమన్నా అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా.. సన్నీ స్థాయికి చేరుతుందా? కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. సమాచారం మేరకు.. నిర్మాతలతో చర్చలు సాగుతున్నాయని టాక్. ఇదే జరిగితే, తమన్నా బాలీవుడ్ కెరీర్లో మైలురాయి నిలుస్తుందని పేర్కొంటున్నారు.