Rashmika about samantha | రష్మిక మందన్న మోచేతిపై ‘ఇర్రిస్ప్లేసబుల్’ అనే పచ్చబొట్టు కనిపిస్తుంది. ఈ కూర్గ్ సౌందర్యరాశి వ్యక్తిత్వానికి ప్రతీకలా ఆ టాటును అభివర్ణించవొచ్చు. తన అందం, అభినయాన్ని మరొకరు భర్తీ చేయలేరనే ఆత్మవిశ్వాస ప్రకటన అది. ఆమె ప్రతి మాటలో ఆ భావం స్ఫురిస్తుంది. అనతికాలంలోనే దక్షిణాదిలో అగ్రపథానికి చేరుకున్న ఈ కన్నడ సోయగం కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకురానుంది. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో రష్మిక మందన్న పాత్రికేయులతో సంభాషిస్తూ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే..
కెరీర్లో తొలిసారి డీగ్లామర్ పాత్రను చేయడం ఎలా అనిపించింది?
‘డియర్ కామ్రేడ్’ సినిమాలో మేకప్ లేకుండా సహజంగా నటించా. డీగ్లామర్ పాత్రను చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఇందులో నా పాత్ర చాలా రస్టిక్‌గా ఉంటుంది. సుకుమార్‌పై నమ్మకంతో కథ పూర్తిగా వినకుండానే సినిమా అంగీకరించా. బేసిక్ పాయింట్ చెప్పి చిత్తూరు యాసను నేర్చుకోమని సుకుమార్ అన్నారు. మూడు సార్లు లుక్ టెస్ట్ చేసి నా పాత్ర తీరుతెన్నులు, మేనరిజమ్స్ గురించి వివరించారు. ఈ ప్రయాణంలో శ్రీవల్లి క్యారెక్టర్‌తో పాటు కథపై అవగాహన వచ్చింది. శ్రీవల్లి ఎవరు? ఆమె నేపథ్యమేమిటో తొలిభాగంలో చూపిస్తే. ఆమె పూర్తి జీవితాన్ని సీక్వెల్లో ఆవిష్కరించబోతున్నారు.
ప్రచార చిత్రాలు చూస్తుంటే మీ పాత్ర భిన్న పార్శాలతో వైవిధ్యంగా కనిపిస్తున్నది?
జీవితాన్ని ఆనందంగా గడపాలనే మనస్తత్వమున్న అమ్మాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తా. అంతర్లీనంగా ఓ తుంటరితనం ఉంటుంది. పుష్పరాజ్ జీవితానికి దృశ్యరూపంగా సినిమా ఉంటుంది. అతడి కుటుంబం, పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.అతడి లైఫ్‌లోకి శ్రీవల్లి ఎలా ప్రవేశించింది? ఆమె ప్రేమ కోసం పుష్పరాజ్ ఏం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. మొండివాడైన కథానాయకుడిని ఆటపట్టించే అల్లరి అమ్మాయిగా విభిన్నంగా నేను కనిపిస్తా. నవ్విస్తూనే భావోద్వేగానికి లోను చేసే క్యారెక్టర్ చేశా.
అల్లు అర్జున్‌తో తొలిసారి కలిసి సినిమా చేయడం ఎలాంటి అనుభూతిని పంచింది?
‘గీతాగోవిందం’ ప్రచార వేడుకకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పనిచేయాలని అప్పుడే కోరుకున్నా. ఆ కల ఈ సినిమాతో తీరింది. బన్నీ సెట్స్‌లో నన్ను కష్మిక అని పిలుస్తుండేవారు. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంటుంది. షూటింగ్ మొదలైన తొలినాళ్లలో అతడితో సమానంగా నటించగలనా? నా పాత్రకు న్యాయం చేస్తానా? లేదా? అని భయపడ్డా. నాలో ఉన్న భయాలను బన్నీకి వివరించా. ‘కష్టపడేతత్వం, ప్రతిభ వల్లే ఈ స్థాయికి చేరుకున్నావు. వాటిని నమ్ముకొనే ముందుకు సాగు’ అని ఆయన సలహా ఇచ్చారు. బన్నీ మాటలతో నాలో ధైర్యం వచ్చింది.
సినిమాలో మీకు చాలెంజింగ్ అనిపించిన ఘట్టమేది? చిత్తూరు యాసపై ఎలా పట్టు పెంచుకున్నారు?
‘సామీ సామీ’ పాటలో బన్నీతో డ్యాన్స్ చేయడం చాలా కష్టమైంది. ఇప్పటికీ విజువల్స్ చూస్తుంటే అందులో డ్యాన్స్ చేసింది నేనేనా అనిపిస్తుంది. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ అమ్మాయి డైలాగ్స్ విషయంలో చక్కటి సహకారం అందించింది. సినిమాలో నా స్నేహితురాలిగా నటించిన అను అనే అమ్మాయి కూడా చిత్తూరు యాసలో డైలాగ్స్ ఎలా పలకాలో నేర్పించింది.
సమంత ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో నర్తించింది? మీరు అలాంటి పాటలకు సిద్ధమేనా?
అగ్రహీరోయిన్‌గా చెలామణి అవుతూ ప్రత్యేక గీతంలో నటించడానికి అంగీకరించడం సమంత గొప్పతనానికి నిదర్శనం. ఆ పాట నాకు చాలా నచ్చింది. బాగుందని సమంతకు మెసేజ్ చేశాను. ప్రత్యేకగీతాల్లో అవకాశం వస్తే ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే ఐటెంసాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదు.
బాలీవుడ్లో అరంగేట్రం చేస్తుండటం ఎలా అనిపిస్తోంది. అమితాబ్‌బచ్చన్‌తో షూటింగ్ అనుభవాలు ఎలా ఉన్నాయి?
హిందీ చిత్రసీమలో తొలినాళ్లలోనే ‘మిషన్ మజ్ను’, ‘గుడ్‌బై’ లాంటి కథాబలమున్న సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా నటన బాగుందంటూ దర్శకులు చెబుతుండటం ఆనందంగా ఉంది. ‘గుడ్‌బై’ సెట్స్‌లో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ మరువలేను. సెట్స్‌లో ఆయన చాలా కామ్‌గా ఉంటారు. భయం లేకుండా పనిచేసేలా సహనటులకు కంఫర్ట్‌ను ఇస్తుంటారు. అందువల్లే ఆయనతో నటించే సమయంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. షాట్ పూర్తయిన తర్వాత అమితాబ్‌బచ్చన్‌తో కూర్చొని మాట్లాడే సమయంలో మాత్రం చాలా భయం వేసేది. నా నటన చూసి ఏమాంటారో, ఆయనతో ఏం మాట్లాడాలో అని టెన్షన్ పడ్డాను. ‘గుడ్‌బై’ సెట్స్‌లో ఉండగా పుష్ప టీజర్ రిలీజ్ అయ్యింది. చిత్రయూనిట్‌కు టీజర్‌ను చూపించాను. అందరికి నచ్చింది. తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ వర్గాలు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తదుపరి సినిమాల విశేషాలేమిటి…
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో పాటు తెలుగులో మరో రెండు సినిమాల్ని అంగీకరించా. హిందీలో మూడు సినిమాలు చేస్తున్నా.
సినిమాల ఎంపికలో మీరు ఏ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు?
అదృష్టం కంటే హార్డవర్క్నే నేను ఎక్కువగా నమ్ముతా. సమిష్టిగా కష్టపడినప్పుడే సినిమా సక్సెస్ అవుతుందని విశ్వసిస్తా. కెరీర్ ఆరంభం నుంచి నాకు ఎదురైన అనుభవాలు నా నటనలో, వ్యక్తిత్వంలో పరిణితిని తీసుకొచ్చాయి. ప్రతి సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. నేను ఒప్పుకున్న సినిమా..అందులోని పాత్ర నటిగా నా ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలని కోరుకుంటా. కొన్నిసార్లు అభిమానుల కూడా ఫలానా పాత్రలు చేయమని చెబుతుంటారు. కథల ఎంపికలో వారిచ్చే సలహాలు దృష్టిలో పెట్టుకున్నా దర్శకుడు సుకుమార్‌తో సినిమా చేయడం అంటే
నటీనటులకు సవాల్ అని చెబుతుంటారు?
‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్ ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోయా. ఆయన సూచనలను పాటిస్తూ సినిమా చేశా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rashmika Vs Samantha | సమంత ఎంట్రీతో రష్మికకు భయం పట్టుకుందా..?
అసలు సమంతకు ఏమైంది.. చిన్న అస్వస్థతకు ఇంత కంగారు ఎందుకు..?
Samantha : ఇదే చివరిసారి.. మళ్లీ అలా చేయనంటున్న సమంత
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
Rashmika Mandanna dating | తన కంటే చిన్నవాడితో డేటింగ్‌పై రష్మిక ఏమన్నదంటే..?
తెలుగు ఓకే.. మిగిలిన భాషల్లో ప్రమోషన్ ఎక్కడ పుష్ప..?