గత 18 రోజులుగా మూసివున్న సినీస్టూడియోల గేట్లు తెరుచుకోనున్నాయి. షూటింగుల లేక మూగబోయిన నగారాలు మళ్లీ మోగనున్నాయి.. ఆర్క్ లైట్ల కాంతులతో షూటింగ్ లొకేషన్లు కళకళలాడనున్నాయి. ‘కెమెరా రోలింగ్.. యాక్షన్..’ అనే శబ్దాలతో స్టూడియోలు దద్దరిల్లనున్నాయి. ఎట్టకేలకు కార్మిక సంఘాలు సమ్మెకు స్వస్తి పలికాయి. ప్రభుత్వ జోక్యంతో మొత్తంగా కథ సుఖాంతమైంది. స్తంభించిన సినీ పరిశ్రమ మళ్లీ కళకళలాడనుంది. గురువారం హైదరాబాద్ చిక్కడపల్లి కార్మికశాఖ కార్యాలయంలో ఫిల్మ్‌ఛాంబర్, నిర్మాతలు, ఎంప్లాయిస్ ఫెడరేషన్లతో 8గంటలపాటు కార్మికశాఖ అదనపు కమీషర్ గంగాధర్ జరిపిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మీడియా సాక్షిగా ప్రకటించారు.
ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలను 30శాతం పెంచాలని నిర్మాతలను కార్మిక సంఘాలు అడగ్గా.. చివరకు 22.5శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించినట్టు కార్మికశాఖ అదనపు కమీషనర్ గంగాధర్ తెలియజేశారు. దిన వేతనం రోజుకు రెండువేలు లోపు తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 12.5 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం.. మొత్తంగా 22.5 శాతం వేతనాలను పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారని గంగాధర్ వివరించారు. అలాగే.. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ కాల్షీట్కు కూడా ఫెడరేషన్ అంగీకరించిందని గంగాధర్ తెలిపారు.
ఆదివారం పనిచేస్తే రెట్టింపు వేతనం ఇవ్వడం నిర్మాతలకు భారంగా మారిన నేపథ్యంలో ఇక నుంచి ఆదివారం పనిచేస్తే 1.5 వేతనం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనీ గంగాధర్ పేర్కొన్నారు. నిర్మాతలకు, ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కూ మధ్య ఇకపై ఎలాంటి వివాదాలు, సమస్యలూ తలెత్తకుండా ఉండేందుకు స్వయంగా ప్రభుత్వమే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నదని. ఇకనుంచి సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా అటు నిర్మాతలుకానీ, ఇటు కార్మికులు కానీ ఆ కమిటీని సంప్రదించవచ్చని కార్మికశాఖ అదనపు కమీషనర్ గంగాధర్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాతలకు, కార్మిక సంఘాలకూ మధ్య కొన్ని సమస్యలు ఇంకా మిగిలివున్నాయని, వాటిపై ఈ కమిటీనే నెలరోజుల్లో ఓ నివేదిక ఇస్తుందని గంగాధర్ అన్నారు.
ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ ‘ మా సమస్యలకు పరిష్కారం ప్రభుత్వ జోక్యం వల్లనే సాధ్యమైంది. ఇరువర్గాలనూ సమన్వయపరచడంలో కార్మిక శాఖ చొరవ చూపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా సమస్యల్లో కొన్ని మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలివున్న సమస్యలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీనే పరిష్కరిస్తుందని నమ్ముతున్నాం. యూనియన్‌లో అందరినీ అన్ని రకాలుగా తృప్తి పరచలేం. వారందరికీ నచ్చజెబుతాం. రేపట్నుంచి షూటింగుల్లో పాల్గొంటాం. నేటితో బంద్‌కు స్వస్తి పలుకుతున్నాం.’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు, ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడు భరత్‌భూషణ్, దామోదరప్రసాద్, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు, పలువురు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ఈ పాల్గొన్నారు.