Vishwak Sen | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ పది రోజులూ ఎంతో పవిత్రమైనవని, ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసినా ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దర్శనానికి టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి మాత్రమే తిరుమలకు చేరుకుంటే, కేవలం రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పడే భారీ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పది రోజుల వ్యవధిలో ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల ద్వారా మొత్తం 7 లక్షల 70 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దర్శన సమయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్లు ఈవో తెలిపారు. ప్రివిలేజ్, బ్రేక్ దర్శనాలను రద్దు చేసి, కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు మాత్రమే అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు.
అన్నప్రసాద కేంద్రంలో ఉదయం నుంచి రాత్రివరకు నిరంతరంగా ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీస్, విజిలెన్స్ సిబ్బందిని నియమించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులను ఉద్దేశించి టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందస్తు దర్శన టోకెన్లు ఉన్నప్పుడే ప్రయాణం చేయాలని ఆయన సూచించారు. టికెట్ లేకుండా వెళ్లడం వల్ల అనవసర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. టీటీడీ మార్గదర్శకాలను భక్తులు తప్పకుండా పాటించాలని, టోకెన్లు లేకుండా వెళ్లి ఇబ్బందులు పడొద్దని, సిబ్బందికి సహకరించాలని విశ్వక్సేన్ కోరారు.
TTD భక్తులకు హీరో విశ్వక్సేన్ కీలక విజ్ఞప్తి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1వ తేదీలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే వారు.. ముందస్తు దర్శన టోకెన్లు ఉంటేనే… pic.twitter.com/Y0P7jQ92dg
— ChotaNews App (@ChotaNewsApp) December 26, 2025