Ace Movie | తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏస్’ (Ace). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. మే 23న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ను అందుకుంది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ప్రకటన లేకుండా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యోగిబాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జైలు నుంచి విడుదలైన బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) కొత్త జీవితం మొదలుపెట్టేందుకు మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానానందం (యోగి బాబు) అతనికి ఆశ్రయం కల్పిస్తాడు. కల్పన (దివ్యా పిళ్లై) నడిపే హోటల్లో చెఫ్‌గా కాశీ పనిలో చేరతాడు. ఈ క్రమంలో రుక్మిణి (రుక్మిణి వసంత్)తో ప్రేమలో పడతాడు. తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుంచి ఇంటిని విడిపించుకోవడానికి ఆమె డబ్బు కూడబెడుతున్న విషయం తెలుసుకుంటాడు. మరోవైపు తన యజమాని కల్పన కూడా హోటల్ లోన్ కట్టలేక ఇబ్బంది పడుతుంది. దీంతో వీరిద్దరి సమస్యలను తీర్చడానికి జ్ఞానానందంతో కలిసి బోల్డ్ కాశీ మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపించే ధర్మ(అవినాశ్) దగ్గర అప్పు తీసుకుంటారు. ఈ క్రమంలో వడ్డీ కట్టడం ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కాశీ ఎలా బయటపడ్డాడు? బ్యాంకు దోపిడీతో సంబంధం ఏమిటి? ఈ నేరాలన్నిటి నుంచి తప్పించుకుని, తాను ప్రేమించిన రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడా? అసలు బోల్ట్ కాశీ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More