అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 6 : ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. విజయ్ దేవరకొండతోపాటు మేనేజర్ రవికాంత్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీలోని పుట్టపర్తికి కారులో బయలుదేరారు.
సోమవారం ఉదయం తిరిగి వస్తుండగా గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలో హైవే-44పై బొలెరో వాహనం ప్రమాదవశాత్తు విజయ్ కారు ఎడమ వైపు తగిలింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. విజయ్‌తోపాటు మరో ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే కర్నూల్ నుంచి మరో కారు తెప్పించిన విజయ్ హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉండవల్లి పోలీసులు సదరు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.