విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘VD12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసే సినిమాపై తాజా వార్త ఒకటి వినిపిస్తున్నది. ఈ సినిమా 1854-78 మధ్య కాలంలో జరిగే పిరియాడిక్ డ్రామా అని అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కథలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ గెటప్‌ని విభిన్నంగా ప్లాన్ చేశారట దర్శకుడు రాహుల్ సంకృత్యన్. దీనికోసం ప్రత్యేకంగా స్కెచెస్ కూడా వేయిస్తున్నారట.
ఈ ఎపిసోడ్ కథకు కీలకం కావడంతో ఇప్పట్నుంచే రాహుల్ సంకృత్యాన్ ఈ గెటప్‌పై కసరత్తులు మొదలుపెట్టారని ఇన్సైడ్ టాక్. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. నానితో రాహుల్ సంకృత్యాన్ చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాను మించేలా ఈ సినిమా కథను రాహుల్ సంకృత్యాన్ తయారు చేశారని, హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.