Vijay Devarakonda | బెట్టింగ్ యాప్స్ కేసు అంశంపై టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇచ్చింది. చట్టం ప్రకారం అనుమతి ఉన్న గేమ్స్‌కి మాత్రమే విజయ్ ప్రచారం చేశారని టీమ్ పేర్కొంది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కే విజయ్ ప్రకటనలు చేశారని పేర్కొంది.అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా పని చేశారని తెలిపింది. అనుమతి ఉన్న ఏ23 సంస్థకు విజయ్ ప్రచారకర్తగా పని చేశారని, రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పినట్లుగా పేర్కొంది. ఏ 23 సంస్థతో విజయ్ ఒప్పందం గతేడాది ముగిసిందని విజయ్ దేవరకొండ టీమ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థతో విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని.. నటుడు ఇల్లీగల్‌గా పని చేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా పనిచేయలేదని వివరణ ఇచ్చింది.
బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే 25 మందిపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని.. వాటి కారణంగా యువత తీవ్రంగా నష్టపోతున్నారంటూ మియాపూర్‌కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం సూచించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత, రీతూచౌదరి, శ్యామల కేసులు నమోదు చేశారు. ఇందులో విచారణకు హాజరుకావాలంటూ పలువురికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే గురువారం టాలీవుడ్‌కు చెందిన నటీనటులు రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, అనన్య నాగళ్లతో పాటు యాంకర్ శ్రీముఖికి సైతం నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇచ్చింది.