అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ వెండితెర హిట్ పెయిర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తారలిద్దరూ న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే కవాతులో సందడి చేశారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ టైమ్ స్కేర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్‌ను నిర్వహించారు.
భారత్ బయట జరిగిన అతిపెద్ద ఇండిపెండెన్స్ డే పరేడ్‌గా ఇది నిలిచింది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్గా గౌరవాన్ని అందుకున్నారు. ఈ జంట ఒకరిచేయి ఒకరు పట్టుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా విరామం తర్వాత ఓ బహిరంగ వేదికపై ఈ తారలిద్దరూ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఫీలయ్యారు. అంతకుముందు న్యూయార్క్‌లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దిన భారత త్రివర్ణ పతాకాన్ని విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.