Vijay Devarakonda | అలంపూర్, అక్టోబర్ 06: సినీ నటుడు విజయ్ దేవరకొండకు పెను ప్రమాదం తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి విజయ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ ఆదివారం సాయంత్రం పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకున్నాడు. అక్కడి నుంచి సోమవారం హైదరాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక వరసిద్ధి కాటన్ మిల్లు సమీపంలోని మలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారు ముందుభాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే కారులో ప్రయాణిస్తున్న విజయ్ దేవరకొండ, మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం అనంతరం విజయ్ దేవరకొండ స్నేహితుని కారులో అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరాడు. విజయ్ దేవరకొండ కారు అతివేగంగా ఉండటంతో బ్రేక్ వేసిన కంట్రోల్ కాక ముందు వాహనాన్ని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు ద్వారా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు పోలీసులు ఓవర్ స్పీడ్ లో భాగంగా ఫైన్ వేసినట్లు కూడా సమాచారం. కాగా, డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.