హైదరాబాద్, ఆట ప్రతినిధి : గ్రామీణ క్రికెటర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ)కు గుర్తింపునివ్వాలని అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి బీసీసీఐని డిమాండ్ చేశారు. జిల్లాలను విస్మరిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) హైదరాబాద్‌కే పరిమితమైన నేపథ్యంలో గ్రామీణ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు టీడీసీఏ అవిరళంగా కృషి చేస్తున్నదని అన్నారు. జిల్లాల్లో వేసవి శిక్షణాశిబిరాలు నిర్వహించే అర్హత హెచ్‌సీఏకు లేదని ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు చాలా ఏండ్లుగా అన్యాయం జరుగుతున్నది. హెచ్‌సీఏ..హైదరాబాద్ వరకే పరిమితమవుతూ మిగతా జిల్లాల క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. ఇన్నేండ్ల సుదీర్ఘ కాలంలో జిల్లాల నుంచి రంజీలతో పాటు దేశవాళీ టోర్నీల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గ్రామీణ క్రికెటర్ల ప్రయోజనాల కోసం టీడీసీఏ ఏర్పాటైంది. అసోసియేషన్ స్థాపించిన అనతికాలంలోనే టీ20 టోర్నీతో పాటు అమెరికా యూత్ టీమ్‌తో మ్యాచ్‌లు ఏర్పాటు చేశాం’ అని ఆయన అన్నారు.