Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై 50శాతం సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనున్నది. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయనున్నట్లు హెచ్చరించారు. వందశాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ సినిమాలపై వందశాతం సుంకాలు అమలుకానున్నాయి. ‘మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి.. ఇతర దేశాలను ఓ శిశువు నుంచి మిఠాయిని తొలగించినట్లుగా దొంగిలించాయని ఆయన ఆరోపించారు. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో ఉన్న కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతింది అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ఈ దీర్ఘకాల, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించడానికి తాను అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100శాతం సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. విదేశీ సినిమాలతో అమెరికన్ సినిమా పరిశ్రమకు ‘జాతీయ ముప్పు’గా ట్రంప్ భావిస్తూ ట్రంప్ మే ఇలాంటి ప్రకటన చేశారు.
ఇదిలా ఉండగా.. గతంలో ట్రంప్ అమెరికాలో షూటింగ్ జరుపుకోని సినిమాలపై ఏకంగా వందశాతం సుంకాలు విధించనున్నట్లు గతంలో ప్రకటించారు. పలువురు నిర్మాతలతో హాలీవుడ్ నష్టపోతుందన్న ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ జరిపి.. అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR)కు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. అయితే, చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని ట్రంప్ అన్నారు. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా తగ్గుతోందని.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాల షూటింగ్ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఇటీవల కాలంలో సినిమా, టెలివిజన్ నిర్మాణం హాలీవుడ్ నుంచి యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తరలిపోతున్నాయి. ఆయా దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దాంతో ఆయా దేశాలకు సినిమా రంగం తరలిపోతున్నది. దాంతో షూటింగ్ ఖర్చు తగ్గుతుంది. కొన్ని సినిమాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతుంటాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ చైనాకు ఉంది. ఇదిలా ఉండగా.. అమెరికాలో భారతీయ సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదలవుతుంటాయి. తెలుగు సినిమాలు సైతం విడుదలయ్యే విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై సైతం ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడ సినిమా విడుదల చేయాలంటే ఇకపై వందశాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్ భారత ఫార్మా ఉత్పత్తులపై అక్టోబర్ ఒకటి నుంచి వందశాతం శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులకు మాత్రం సుంకాలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే, ప్రతి సంవత్సరం భారత్ నుంచి అమెరికాకు 10 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి జరుగుతాయి. ఫార్మాతో భారీ ట్రక్కులు, కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వానిటీలతో పాటు పలు వస్తువులపై 50శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.