Actor Vijay | తమిళనాడులో గత ఏడాది చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి టీవీకే (తమిళగ వెట్రి కజగం) చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో, బాధ్యతలు, నిర్వహణ లోపాలు, భద్రతా వైఫల్యాలపై సీబీఐ లోతైన విచారణ చేపట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన రాజకీయ ప్రచార సభలో విజయ్ ప్రసంగించేందుకు వచ్చిన సమయంలో భారీగా ప్రజలు తరలివచ్చారు. ఒక్కసారిగా జనసమూహం అదుపు తప్పడంతో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన జనసమూహ నిర్వహణ, పోలీసు మరియు పరిపాలనా సంసిద్ధతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసు దర్యాప్తును రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని పర్యవేక్షక కమిటీ పర్యవేక్షిస్తోంది. కమిటీ సూచనల మేరకు సీబీఐ బాధ్యతల నిర్ణయం, ప్రణాళికా వైఫల్యాలు, ఘోర విషాదానికి దారితీసిన సంఘటనల క్రమంపై దృష్టి సారిస్తూ విచారణను ముమ్మరం చేసింది.దర్యాప్తులో భాగంగా ఇప్పటికే టీవీకే పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలను సీబీఐ విచారించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా కార్యదర్శి మథియజగన్ సహా కీలక నేతల వాంగ్మూలాలను నమోదు చేసింది. సభ నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ముందస్తు ప్రణాళికలు ఎలా చేపట్టారు, భద్రతా చర్యలు తగిన స్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలపై సీబీఐ వివరంగా ప్రశ్నించింది.
ఈ విచారణల అనంతరం, ఈ కేసుకు సంబంధించి విజయ్ పాత్రపై స్పష్టత కోసం సీబీఐ ఆయనను ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. ఆ మేరకు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజాలు బయటకు రావాలన్న డిమాండ్‌తో బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్న వేళ, సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు, బాధ్యులపై తీసుకునే నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారాయి.