Vijay | తమిళనాడు రాజకీయాలు అంటే సినీ గ్లామర్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న రాష్ట్రంలో, ఇప్పుడు నటుడు విజయ్ స్థాపించిన పార్టీ సంచలన విజయాలతో కొత్త ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. సినీ హీరోగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్, “దళపతి”గా అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలి ఎన్నికల్లోనే సత్తా చాటడం విశేషం.ఇప్పటి వరకు విజయ్ ఒంటరిగానే తన పార్టీని ముందుకు నడిపిస్తుండగా, ఇప్పుడు ఆయనకు మరో సినీ తార జత కాబోతుందనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా విజయ్ పార్టీ ద్వారానే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాలైన తిరుచ్చి (ఈస్ట్), పెరంబూర్ నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. ఒకవేళ ఈ రెండు చోట్ల గెలిస్తే, రాజ్యాంగ ప్రకారం ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే నియోజకవర్గం నుంచే త్రిషను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి త్రిష విజయ్‌కు అన్ని విధాలుగా అండగా ఉన్నారని, బయటకు కనిపించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన విజయ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక వ్యక్తిగతంగా కూడా విజయ్, త్రిష మధ్య మంచి స్నేహం ఉందని తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చకు దారితీసింది. ఆయన భార్య సంగీత చేసిన ఆరోపణలు రాజకీయంగా కూడా ప్రభావం చూపించాయి. సీనియర్ హీరోయిన్‌తో విజయ్ సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలను ప్రతిపక్షాలు ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నాయి. అయితే విజయ్ మాత్రం ఈ వివాదాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇవి తన వ్యక్తిగత విషయాలని, తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ విజయమే ముఖ్యమని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని తన శ్రేణులకు సూచించారు. దీంతో ఆ వివాదానికి కొంతమేరకు ముగింపు పలికినట్టైంది.