e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

తెరపై వారు క‌నిపిస్తే న‌వ్వులు పూలు పూస్తాయి. వారి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. అలాంటి ఎంతోమంది న‌టీన‌టులు భౌతికంగా మ‌న‌కు దూర‌మైనా.. వారి న‌ట‌న‌, కామెడీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది. గ‌త ద‌శాబ్ద కాలంలో టాలీవుడ్ కోల్పోయిన ప‌లువురు న‌టీన‌టులు, సినీ ప్రముఖుల వివ‌రాలు మీకోసం..

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

వేదం నాగ‌య్య (27 మార్చి 2021)

‌వేదం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాగ‌య్య శ‌నివారం క‌న్నుమూశారు. 30కి పైగా సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామానికి చెందిన నాగ‌య్యకు ఊర్లో రెండెక‌రాల భూమి ఉండేది. అక్క‌డ ప‌ని లేక‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇచ్చిన డైలాగ్‌ని కంఠ‌స్తం ప‌ట్టి గ‌డ‌గ‌డ చెప్ప‌డంతో అత‌ని ప్ర‌తిభ‌ని గుర్తించి వేదం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్ప‌టి నుండి అత‌నికి వేదం నాగ‌య్యగా పేరు వ‌చ్చింది. నాగ‌వ‌ల్లి, ఒక్క‌డినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వ‌స్తావ‌య్యా, స్పైడ‌ర్, విరంజి ఇలా ప‌లు సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య తొలుత మూడు వేల పారితోషికం అందుకున్నారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

వి. దొర‌స్వామి రాజు( 2021 జ‌న‌వ‌రి 18)

నాగార్జున‌తో అన్న‌మ‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సింహాద్రి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ సినిమాల‌ను అందించిన వి.దొర‌స్వామి రాజు అనారోగ్యంతో 2021 జ‌న‌వ‌రి 18న క‌నానోమీటర్. విజ‌య మారుతీ క్రియేష‌న్స్‌(వీఎంసీ) బ్యాన‌ర్‌పై సీతారామ‌య్య గారి మ‌నుమ‌వ‌రాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, కిరాయిదాదా వంటి సినిమాల‌ను దొర‌స్వామి నిర్మించారు. సీడెడ్‌లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరున్న దొర‌స్వామి రాజు.. దాదాపు వెయ్యి సినిమాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

వెన్నెలకంటి(2021 జనవరి 5)

‘మాటరాని మౌనమిది.. మౌనవీణ గాణమిది.. ’ అంటూ తెలుగు ప్రేక్షకులకు అజరామరమైన సాహిత్యాన్ని అందించిన గీత రచయిత వెన్నెలకంటి. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. 11 ఏళ్ల వయసులోనే కవితలు, పద్యాలు రాయడంలో నిష్ణాతులయ్యారు.  దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా గీతాలతో సాహితీ సేవ చేయశారాయన. వీటిలో 1500 పాటలు డబ్బింగ్ చిత్రాలవే. డబ్బింగ్ పాటల్లో కూడా తెలుగుదనం కనిపించడం వెన్నెలకంటి సాహిత్యంలో ప్రత్యేకత.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

న‌ర్సింగ్ యాద‌వ్‌(2020 డిసెంబ‌ర్ 31)

న‌ర్సింగ్ యాద‌వ్ అస‌లు పేరు మైలా న‌ర‌సింహ యాద‌వ్‌. 1968 జ‌న‌వ‌రి 26న జ‌న్మించాడు. విజ‌య నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హేమాహేమీలు చిత్రంతో న‌ర్సింగ్ సినీరంగ ప్ర‌వేశం చేశారు. ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క్ష‌ణ‌క్ష‌ణం సినిమాతో న‌ర్సింగ్ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంత‌రం వ‌ర్మ చాలా సినిమాల్లో న‌ర్సింగ్‌కు అవ‌కాశాలిచ్చారు. బాషా, మాస్ట‌ర్‌, చంద్ర‌లేఖ‌, ఇడియ‌ట్‌, ఠాగూర్‌, వ‌ర్షం, సై, శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, మాస్‌, డార్లింగ్ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో న‌ర్సింగ్ న‌టించారు. చివ‌ర‌గా మెగాస్టార్ క‌మ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం.150లోనూ న‌టించి న‌వ్వులు పూయించారు. 300కి పైగా సినిమాల్లో న‌టించిన న‌ర్సింగ్ యాద‌వ్‌..  కిడ్నీ స‌మ‌స్య‌తో 2020 డిసెంబ‌ర్ 31న క‌న్నుమూశారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

జయప్రకాశ్‌రెడ్డి(2020 డిసెంబర్ 10)

రాయలసీమ యాసలో మాట్లాడుతూ సీరియస్ విలనిజం చేయాలన్నా.. అవే డైలాగులతో కడుపుబ్బ నవ్వించాలన్నా అది జయప్రకాశ్ రెడ్డితోనే సాధ్యం. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయమైన జేపీ.. బాలయ్య హీరోగా వచ్చిన ‘సమరసింహారెడ్డి’ సినిమాతో తన విశ్వరూపం చూపాడు. ఈ సినిమాతో నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సీరియస్ విలనిజం చూపిన జేపీ.. తర్వాత కమెడియన్‌గానూ పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. చివరకు 2020 సెప్టెంబర్ 8న గుంటూరులోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(2020 సెప్టెంబర్ 25)

తన గొంతుతో తెలుగు ప్రజల గుండెలను తాకిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబరులో కన్నుుమూశారు. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో బాలు జన్మించారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. మొదట ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లోనే పాడే అవకాశం పొందారు. ఆ తర్వాత తెలుగు, తమిళంతో పాటు హిందీ, ఒరియా, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషల్లో కలిపి 40వేలకు పైగా పాటలు పాడారు. సంగీత దర్శకుడిగా కూడా 40కి పైగా సినిమాలకు పనిచేశాడు. నటుల హావభావాలు, నటనా శైలికి అనుగుణంగా పాడటం బాలు ప్రత్యేకత. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. 1969లో తొలిసారి బాలు నటుడిగా మారారు. పవిత్ర బంధం, రక్షకుడు, దీర్ఘసుమంగళీభవ, ప్రేమికుడు, మిథునం వంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఏపీ ప్రభుత్వం నుంచి 25 విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకు గానూ నంది ప్రత్యేక బహుమతి లభించింది.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

కోసూరి వేణుగోపాల్‌( 2020 సెప్టెంబ‌ర్ 23)

మ‌ర్యాద రామ‌న్న సినిమాలో బ్ర‌హ్మ‌జీ తండ్రిగా న‌టించిన ఈ న‌టుడు గుర్తున్నాడా! ఆ సినిమాలో కోసూరి వేణుగోపాల్ క‌నిపించేది కొన్ని సీన్ల‌లోనే అయినా న‌వ్వులు పూయించాడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజ‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో న‌టించిన కోసూరి.. విక్ర‌మార్కుడు, పిల్ల జ‌మీందార్‌, ఛ‌లో వంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాల్లో న‌టించాడు. గ‌త ఏడాది క‌రోనా సోక‌డంతో 22 రోజులు హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందాడు. చివ‌ర‌కు ప‌రిస్థితి విష‌మించ‌డంతో సెప్టెంబ‌ర్ 23న తుదిశ్వాస విడిచాడు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

కొండపల్లి శ్రావణి(2020 సెప్టెంబర్ 8)

మనసు మమత, మౌనరాగం టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి శ్రావణి 2020 సెప్టెంబర్ 8న అనుమానాస్పదంగా మతి చెందింది. ప్రేమ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

మంచాల సూర్యనారాయణ(2020 జులై 25)

సినిమాలతో పాటు నాటకాలు, టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు మంచాల సూర్యానారాయణ 2020 జులై 25న కన్నుమూశారు. 1988లో వచ్చిన వివాహ భోజనంబు చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పలు సినిమాలతో పాటు రుతురాగాలు, ఆడది, మనసు మమత, వదినమ్మ, రామసక్కని సీత వంటి సీరియళ్లలోనూ ఆయన నటించారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

రావి కొండలరావు(2020 జులై 28)

కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన వ్యక్తి రావి కొండలరావు. 1932 ఫిబ్రవరి 11న శ్రీకాకుళంలో రావి కొండలరావు జన్మించారు. 1965లో చదువు పూర్తి చేసి.. ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా శ్రీశ్రీ, అరుద్రలతో కలిసి పనిచేవారు. ఆ తర్వాత ముళ్లపూడి రమణ సలహాతో నటుడిగా మారి దాదాపు 600 చిత్రాల్లో నటించారు. రావి కొండలరావు భార్య రాధాకుమారి కూడా నటే. వీరిద్దరూ 127 సినిమాల్లో భార్యాభర్తలుగా నటించడం విశేషం. రాధాకుమారి 2012లో మరణించారు. రావి కొండలరావు జులై 28న గుండెపోటుతో కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

గొల్ల‌పూడి మారుతీరావు(12 డిసెంబ‌ర్ 2019)

ఎన్నో సినిమాల‌కు మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన గొల్ల‌పూడి మారుతీరావు 50 ఏళ్ల వ‌య‌సులో న‌టుడిగా మారారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో తొలిసారి తెర‌పై క‌నిపించిన గొల్ల‌పూడి.. ఆ త‌ర్వాత నటుడిగా ఫుల్ బిజీ అయ్యారు. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, స‌హాయ‌న‌టుడిగా భిన్న పాత్ర‌ల్లో న‌టించారు. సంసారం ఒక చ‌ద‌రంగం, అభిలాష‌, స్వాతిముత్యం వంటి ఎన్నో సినిమాల్లో అద్భుత‌మైన పాత్ర‌లు పోషించారు. 2019 డిసెంబ‌ర్ 12న అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గొల్ల‌పూడి క‌న్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

గీతాంజలి (30 అక్టోబర్ 2019)

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సీతారాముల కళ్యాణం’తో గీతాంజలి వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే ఎన్టీఆర్‌కు పోటీగా నటించడంతో ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అన్ని భాషల్లో కలిపి 500కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. 2019 అక్టోబర్‌లో గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుది శ్వాస విడిచారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

వేణుమాధవ్(2019 సెప్టెంబర్ 25)

ఏ పాత్ర చేసినా అందులో లీనమై నవ్వుల వేణువై కితకితలు పెట్టేవారు వేణుమాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి, వెండితెరకు అడుగుపెట్టిన వేణుమాధవ్.. దాదాపు 600 చిత్రాల్లో నటించారు. ‘హంగామా’, ‘భూకైలాష్’, ‘ప్రేమాభిషేకం’ వంటి సినిమాలతో హీరోగానూ మెప్పించాడు. 2019 సెప్టెంబర్‌లో అనారోగ్యంతో వేణుమాధవ్ కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

నారమల్లి శివప్రసాద్(2019 సెప్టెంబర్ 21)

ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే.. సినిమాల్లోనూ నటించి మెప్పించాడు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్. ‘ఖైదీ’, ‘జై చిరంజీవ’, ‘యముడికి మొగుడు’, ‘డేంజర్’, ‘ఆటాడిస్తా’ వంటి సినిమాల్లో ఆయన నటించాడు. ప్రేమ తపస్సు, ‘టోపీ రాజా’, ‘స్వీటీ రోజా’, ‘ఇల్లాలు’, కొక్కొరొకో’ అనే నాలుగు సినిమాలకు దర్శకుడిగానూ పనిచేశారు. మూత్రపిండాల సంబధిత సమస్యతో బాధపడుతూ 2019 సెప్టెంబర్ 21న శివప్రసాద్ తుది శ్వాస విడిచారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

దేవదాస్ కనకాల(2019 ఆగస్ట్ 2)

ఎంతోమందికి నటనలో శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు దేవదాస్ కనకాల. రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎంతోమంది నటులు ఆయన శిష్యులే. వందకు పైగా చిత్రాల్లో నటుడిగా, ప్రతినాయకుడిగా,కమెడియన్‌గా నటించిన దేవదాస్ కనకాల.. 2019 ఆగస్ట్ 2న కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

విజయ నిర్మల(27 జూన్ 2019)

బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా సినీరంగంలో సేవలందించారు విజయ నిర్మల. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా అప్పట్లోనే ఆమె గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అనారోగ్యంతో 2019 జూన్ 27న విజయ నిర్మల కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

గిరీశ్ కర్నాడ్(2019 జూన్ 10)

భాషతో సంబంధం లేకుండా బహుభాషా నటుడిగా గుర్తుండిపోయే వ్యక్తి గిరీశ్ కర్నాడ్. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటుడిగా, దర్శకుడిగా,సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన గిరీశ్ కర్నాడ్ 2019 జూన్ 10న కన్నుమూశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్‌తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆయన్ను వరించారు. ఇవికాకుండా ఫిలింఫేర్, 10 జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

రాళ్లపల్లి నరసింహారావు(2019 మే17)

హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా దాదాపు 850కి పైగా సినిమాల్లో రాళ్లపల్లి నరసింహారావు నటించారు. తన నటనతో, డైలాగులతో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాళ్లపల్లి గత ఏడాది మే 17న కన్నుమూశారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

కోడి రామకృష్ణ (2019 ఫిబ్రవరి 22)

తెలుగు చిత్రసీమలో గ్రాఫిక్స్‌తో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలు.. మరోవైపు ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ వంటి గ్రాఫిక్స్ ప్రధాన చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానే కాకుండా పలు సినిమాల్లో తెరపై కనిపించిన కోడి రామకృష్ణ 2019 ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

దీవి శ్రీనివాస దీక్షితులు( 2019 ఫిబ్రవరి 19)

‘అతడు’, ‘మురారి’ వంటి పలు చిత్రాల్లో పూజారిగా నటించి మెప్పించిన శ్రీనివాస దీక్షితులు 2019 ఫిబ్రవరి 19న కన్నుమూశారు. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘వర్షం’ సినిమాల్లో ఆయన నటించారు. టీవీలో ఆయన నటించిన ‘ఆగమనం’ సీరియల్‌కు నంది అవార్డు కూడా వరించింది.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

వైజాగ్ ప్రసాద్ (2018 అక్టోబర్ 21)

వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. వైజాగ్ ప్రసాద్ దాదాపు 170 సినిమాలో నటించారు. ‘నువ్వు నేను’ సినిమాలో ఉదయకిరణ్ తండ్రి పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కాయి. ‘భద్ర’ సినిమాలో రవితేజ మేనమామగా, ‘జై చిరంజీవ’లో భూమిక తండ్రిగా ప్రసాద్ మెప్పించారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

నందమూరి హరికృష్ణ( 2018 ఆగస్టు 29)

సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఎన్టీఆర్ వారసుడిగా సినిమల్లోకి వచ్చిన హరికృష్ణ.. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘శివరామరాజు’ సినిమాలతో నటుడిగా మెప్పించారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

మాదాల రంగారావు (2018 మే 27)

విప్లవాత్మక సినిమాల్లో నటించి రెడ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మాదాల రంగారావు. నవతరం పిక్చర్స్ బ్యానర్‌పై ‘యువతరం కదిలింది’, ‘ఎర్ర మల్లెలు’, ‘ప్రజాశక్తి’, ‘ఎర్ర సూర్యుడు’ వంటి ఎన్నో సినిమాలను నిర్మించి నటించారు. 1980లో వచ్చిన ‘యువతరం కదిలింది’ సినిమాతో నంది అవార్డును అందుకున్నాడు మాదాల రంగారావు. 2018 మే 27న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

శ్రీదేవి (2018 ఫిబ్రవరి 24)

భారతీయ సినీ చరిత్రలో అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగిన అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో అకాల మరణం చెందారు.‘పదహారేళ్ల వయసు’ సినిమాతో బాల నటి నుంచి కథానాయికగా మారిన శ్రీదేవి.. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

గుండు హనుమంతరావు (2018 ఫిబ్రవరి 19)

తీవ్ర అనారోగ్యంతో 2018 ఫిబ్రవరి 19న గుండు హనుమంతరావు కన్నుమూశారు. ‘అహ నా పెళ్లం’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గుండు హనుమంతరావు సుమారు 400 సినిమాల్లో నటించారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘పెళ్లాం ఊరిళితే’ వంటి సినిమాల్లో తన హాస్య జల్లులతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇక టెలివిజన్ రంగంలో ‘అమృతం’ సీరియల్‌లో అంజి పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ సిరియల్‌కు గానూ ఆయన నంది అవార్డు అందుకున్నారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

సినారె ( 2017 జూన్ 12)

సాహితీ లోకంలో తెలుగు భాషకు పట్టం కట్టి జ్ఞానపీఠాన్ని అధిరోహించిన కవి సామ్రాట్ సినారె.. 2017 జూన్ 12న తుది శ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హన్మాజీపేటలో పుట్టిన సినారె.. సాహితీరంగంలో మేరు శిఖరంలా ఎదిగారు. సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర సీమ కోసం ఎన్నో పాటలు రాశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

దాసరి నారాయణరావు(2017 మే 30)

దర్శకరత్న దాసరి నారాయణరావు 2017 మే 30న కన్నుమూశారు. ఒక జోనర్‌కు పరిమితం కాకుండా ఆయన విభిన్న చిత్రాలు తీసి టాలీవుడ్‌‌కు ఎన్నో హిట్టులు అందించారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి, అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

రంగనాథ్ (2015 డిసెంబర్ 19)

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రంగనాథ్ దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లో నటించిన రంగనాథ్‌కి రచయితగా, సాహితీవేత్తగా మంచి పేరుంది. భార్య మృతి తర్వాత ఒంటరితనానికి గురైన రంగనాథ్.. 2015 డిసెంబర్ 19న ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పలు అనుమాలకు తావిచ్చింది.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

కొండవలస లక్ష్మణరావు (2015 నవంబర్ 2)

‘నేనొప్పుకోను.. అయితే ఓకే’ డైలాగ్ చెప్పగానే గుర్తొచ్చే నటుడు కొండవల. లేటు వయసులో సినిమాల్లోకి వచ్చిన కొండవలస.. తొలి చిత్రం ‘ఔనూ వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో పాపులర్ అయ్యారు. ‘కబడ్డీ కబడ్డీ’, ‘సత్యం’, ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘ఎవడి గోల వాడిదే’, ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’ తదితర చిత్రాలు కొండవలసకు చక్కటి పేరు తెచ్చాయి. సినిమాల్లోకి రాకముందు కొండవలస దాదాపు వెయ్యి నాటకాల్లో నటించారు. జీవితంలో ఒక్కసారైనా భావోద్వేగ పాత్రలు చేయాలని ఆశపడిన ఆయన.. ఆ కోరిక తీరకుండానే 2015 నవంబర్ 2న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

మనోరమ (2015 అక్టోబర్ 10)

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన మనోరమ 2015 అక్టోబర్‌ 10న కన్నుమూశారు. మనోరమ అసలు పేరు పతరు గోపీశాంత. తెలుగులో రిక్షావోడు, ‘శుభోదయం’, ‘అరుంధతి’ వంటి సినిమాల్లో ఆమె నటించారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన నటిగా 1985లో ఆమె గిన్నిస్ రికార్డులకెక్కారు. సినీరంగంలో ఆమె సేవకుగానూ 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ముగ్గరు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితతో ఆమె పలు సినిమాల్లో నటించారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఆర్తి అగర్వాల్ (2015 జూన్ 6)

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్.. కెరీర్ తొలినాళ్లలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తరుణ్‌తో ఎక్కువ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ‘అందాల రాముడు’ సినిమాలో సునీల్ సరసన కమెడియన్‌గా నటించింది. పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో అడపా దడపా సినిమాల్లోనూ ఆర్తి నటించింది. కానీ అవేవీ సక్సెస్‌ను అందించలేకపోయాయి. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు లైఫో సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. ఈ ఆపరేషన్ వికటించడంతో 2015 జూన్ 6న అమెరికా న్యూజెర్సీలోని ఓ ఆస్పత్రిలో ఆర్తి అగర్వాల్ కన్నుమూసింది. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

రామానాయుడు( 2015 ఫిబ్రవరి 18)

సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాముడు భీముడు’ చిత్రంతో నిర్మాతగా సినీ కెరీర్ మొదలుపెట్టి మూవీ మొఘల్‌గా ఎదిగారు రామానాయుడు. నిర్మాతగా ఐదు దశాబ్దాల ప్రస్థానంలో.. భారతీయ భాషలన్నింటిలోనూ ఆయన సినిమాలు నిర్మించారు. ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఎం.ఎస్. నారాయణ (2015 జనవరి 23)

కళ్ల కింద క్యారీ బ్యాగులు వేసుకుని ఫైర్ స్టార్ సాల్మన్ రాజుగా కనిపించినా.. జీవితంలో ఎప్పటికైనా హీరో కావాలనే తపనతో అందరు హీరోలను ఇమిటేట్ చేసే బొక్కా వెంకటేశ్వరరావుగా అయినా.. ‘ఇక్కడేం జరుగుతుందో తెలియాలి’ అంటూ ప్రశ్నించే పల్లెటూరి వ్యక్తిగా అయినా సరే.. తెరపై ఎం.ఎస్. నారాయణ కనిపిస్తే నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ‘ఎం.ధర్మరాజు MA’లో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైన ఎం.ఎస్. నారాయణ.. పెదరాయుడు సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో 700కు పైగా సినిమాల్లో నటించిన ఎం.ఎస్.నారాయణ.. ‘కొడుకు’, ‘భజంత్రీలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిడ్నీ, గుండె సమస్యలతో ఎం.ఎస్.నారాయణ.. 2015 జనవరి 23న తుది శ్వాస విడిచారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఆహుతి ప్రసాద్ (2015 జనవరి 4)

‘ఆహుతి’ చిత్రంలో అద్భుత నటనతో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు అడుసుమిల్లి జనార్దన్ ప్రసాద్. ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాతో సినీ జీవితం ప్రారంభించిన ఆహుతి ప్రసాద్ 300కి పైగా సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా మెప్పించారు. ‘చందమామ’ సినిమాలో పెద్దమనిషిగా కనిపిస్తూనే కామెడీ చేయడం, ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంలో బద్ధకస్తుడిగా మెప్పించడం ఆయనకే చెల్లింది. ‘చందమామ’ సినిమాతో నంది అవార్డు అందుకున్నఆహుతి ప్రసాద్.. 2015 జనవరి 4న అనారోగ్యంతో కన్నుమూశారు. 

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

కె.బాలచందర్ (2014 డిసెంబర్ 23)

దక్షిణ భారత సినీరంగంపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు కె.బాలచందర్. 45 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాలను ఆయన రూపొందించారు. కమల్ హాసన్, రజినీకాంత్ సహా సరిత, జయప్రద, సుజాత వంటల్లో ఎంతోమంది నటీనటులను బాలచందర్ సినిమాల్లోకి తీసుకొచ్చారు. హీరోయిజానికి బదులు సామాజిక సమస్యలు,  మానవ సంబంధ సంఘర్షణలే బాలచందర్ సినిమాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’, ‘రుద్రవీణ’ సినిమాలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బాలచందర్ 2014 డిసెంబర్ 23న కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

చక్రి (2014 డిసెంబర్ 15)

సుమారు 85కు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చిన చక్రి 2014 డిసెంబర్ 15న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ‘బాచి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తొలి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ‘సత్యం’ సినిమాకు అందించిన సంగీతానికి గానూ చక్రి ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. ‘సింహా’ సినిమాకు నంది అవార్డు గెలుచుకున్నాడు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

బాపు (2014 ఆగస్టు 31)

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుడు బాపు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ‘ముత్యాలముగ్గు’, ‘పెళ్లిపుస్తకం’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలకు బాపు దర్శకత్వం వహించారు. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయన అందుకున్నారు. కార్టూనిస్ట్, చిత్రకారుడిగా సుప్రసిద్ధులైన బాపు.. అనారోగ్యంతో 2014 ఆగస్టు 31న కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

తెలంగాణ శకుంతల (2014 జూన్ 14)

సినిమాల్లో తెలంగాణ యాసలో  డైలాగులు అంటే ముందుగా గుర్తొచ్చేది తెలంగాణ శకుంతల. తెలంగాణ యాసలో బెదిరిస్తూ విలనిజం చేయాలన్నా.. అవే డైలాగులతో కామెడీ చేయాలన్న ఆమెకే సొంతం. తెలంగాణ యాసలో ఆమె డైలాగులు చెప్పే తీరు మామూలు శకుంతలను తెలంగాణ శకుంతలగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేశాయి. ‘నువ్వు నేను’, ‘సొంతం’, ‘లక్ష్మీ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. 2014 జూన్ 14న కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

అక్కినేని నాగేశ్వరరావు (2014 జనవరి 22)

తెలుగు సినీ దిగ్గజం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న కన్నుమూశారు. దాదాపు తన 80 ఏళ్ల సినీ కెరీర్‌లో అనేక సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. 17 ఏళ్ల వయసులో ‘ధర్మపత్ని’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’. ఈ సినిమాలో తన వారసులతో 91 ఏళ్ళ వయసులోనూ చురుగ్గా నటించారు. మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించడంలో ముఖ్య భూమిక పోషించారు. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఉదయ్ కిరణ్ (2014 జనవరి 5)

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి తారాజువ్వల దూసుకొచ్చాడు ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ ఇమేజ్‌తో కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్లను అందుకోవడం చూసిన చాలామంది.. ఉదయ్ కిరణ్ టాలీవుడ్‌లో అగ్రహీరో అవ్వడం ఖాయమని చాలామంది అనుకున్నారు. కానీ ఏ స్పీడ్‌తో పైకి వచ్చాడో.. అదే స్పీడ్‌తో కిందపడిపోయాడు. వరుస ఫ్లాపులతో అవకాశాలు తగ్గిపోవడం, వ్యక్తిగత సమస్యలు ఎక్కువ కావడంతో డిప్రెషన్‌కు గురయ్యాడు. దీంతో నిండు నూరేళ్ల జీవితాన్ని 2014 జనవరి 5న అర్ధాంతరంగా ముగించాడు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (2012 డిసెంబర్ 7)

‘మాక్కూడా తెలుసు బాబూ..’, ‘నిజం చెప్పమంటారా.. అబద్దం చెప్పమంటారా..’ వంటి మాట విరుపు డైలాగులు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేస్తారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. తనదైన డైలాగ్ డెలివరీ, కామెడీతో ఆయన సుమారు 870 చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. నరేశ్ హీరోగా వచ్చిన ‘తోకలేని పిట్ట’ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ‘డింగ్ డాంగ్’ అనే షోకి వ్యాఖ్యతగా కూడా ఆయన పనిచేశారు. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. అనారోగ్యంతో 2013 డిసెంబర్ 7న తుదిశ్వాస విడిచారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం(2013 నవంబర్ 8)

‘నాకదో తుత్తి’ అంటూ నత్తితో నవ్వించాలన్నా.. ఎదుటివారికి అర్థం కాకుండా స్పీడ్‌గా మాట్లాడుతూ కామెడీ పుట్టించాలన్నా ఏవీఎస్‌కు ఇంకెవరూ సాటిరారు. ‘రంగుపడుద్ది’ అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూనే ప్రేక్షకుల మొహంలో నవ్వు తెప్పించగలరు. 1993లో విడుదలైన ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఏవీఎస్.. తన 19 ఏళ్ల సినీ కెరీర్‌లో 500కి పైగా చిత్రాల్లో నటించారు. కేవలం కామెడీ పాత్రలే కాకుండా.. ‘అంకుల్’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కంట తడి పెట్టించారు. ఈ సినిమాలో నటనకు గానూ నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో 2013 నవంబర్ 8న ఏవీఎస్ కన్నుమూశారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

శ్రీహరి (2013 అక్టోబర్ 9)

నెగెటివ్ షేడ్స్ ఉన్ పాత్రలతో తెరంగేట్రం చేసి కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో మెప్పించిన నటుడు రఘుముద్రి శ్రీహరి. తెలుగు సినిమాల్లో అన్నయ్య, బాబాయ్, డాన్.. ఇలా ఏ పాత్రలో అయినా సరే.. శ్రీహరి అయితే ఆ పాత్రకు చక్కగా సరిపోతాడు అని అందరూ అనుకునే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన శ్రీహరి.. 2013 అక్టోబర్ 9న  హఠాన్మరణం చెందారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

యశో సాగర్ (2012 డిసెంబర్ 19)

కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో యశోసాగర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకున్న యశో సాగర్.. ప్రముఖ కన్నడ నిర్మాత బి.వి.సోము కుమారుడు. అతని అసలు పేరు భరత్. కర్ణాటకలోని తమకూరు జిల్లా శిరా దగ్గర 2012 డిసెంబర్ 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో యశోసాగర్ దుర్మరణం చెందాడు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ఈవీవీ సత్యనారాయణ (2011 జనవరి 21)

తెలుగు సినీ ఇండస్ట్రీలో నవ్వుల దర్శకుడిగా పేరుగాంచిన ఈవీవీ సత్యనారాయణ 2011 జనవరి 21న కన్నుమూశారు. ‘చెవిలో పువ్వు’ సినిమాతో దర్శకుడిగా మారిన ఈవీవీ.. ‘హలో బ్రదర్’, ‘అప్పుల అప్పారావు’, ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘సూర్యవంశం’ వంటి ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తన కుమారులైన ఆర్యన్ రాజేశ్‌తో ‘ఎవడి గోల వాడిదే’, అల్లరి నరేశ్‌తో ‘కితకితలు’, ‘బెండు అప్పారావు ఆర్‌ఎంపీ’, ‘కత్తి కాంతారావు’ వంటి సినిమాలు కూడా తెరకెక్కించారు.

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

వేటూరి సుందరరామ్మూర్తి (2010 మే 22)

తెలుగు సినిమా పాటలకు కొత్తదారి చూపించిన ఘనుడు వేటూరి సుందరరామ్మూర్తి. సాహితీ విలువలకు పెద్ద పీట వేస్తూ అద్భుత గీతాలు ఆవిష్కరించాలన్నా.. జానపద శైలిలో పదాలు జాలువార్చాలన్నా.. మాస్ మసాలా దట్టించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమాలకు ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలను అందించిన వేటూరి.. 2010 మే 22న తనువు చాలించారు. ప్రస్తుతం మన మధ్య ఆయన లేకున్నా.. ఆయన రాసిన వేలాది పాటలు ఇప్పటికీ సాహితీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.

గత దశాబ్దంలోనే రవితేజ సోదరుడు భరత్, రామోజీరావు తనయుడు సుమన్, కోట శ్రీనివాస్ కుమారుడు వెంకట ఆంజనేయ ప్రసాద్, రామిరెడ్డి కూడా అకాల మరణం చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వేదం నాగ‌య్య మృతి.. ప్ర‌ముఖుల సంతాపం

త‌మ‌న్నా ఫ‌న్నీ వీడియో.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్

నితిన్ కెరియ‌ర్‌లో సెకండ్‌ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్..

చ‌ర‌ణ్‌తో స్టైలిష్ ఫొటో దిగిన ఎన్టీఆర్.. పిక్ వైర‌ల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

ట్రెండింగ్‌

Advertisement