న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘5జీ మెగా స్కామ్’కు రంగం సిద్ధం చేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని, పాలనాపరమైన ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందించారు.
బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించి గత పాలసీని‘(ముందొచ్చిన వాళ్లకు తొలి అవకాశం)’ వ్యతిరేకించిన ప్రధాని మోదీ, ఇదే బీజేపీ.. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ ద్వారా స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన అదే పాలసీని గత ఏడాది పార్లమెంట్లో ఎంపీలను బయటకు పంపి మరీ ఆమోదించుకొన్నదని సంజయ్ సింగ్ విమర్శించారు.