సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు చేసే అంశంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పర్సంటేజీ విధానాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం కుదరదని అగ్ర నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర విమర్శలతో టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) గురువారం ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ ‘2008 నుంచే మేము సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం కోసం పోరాడుతున్నాం. ‘హరిహర వీరమల్లు’ సినిమా సమయంలోనే ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు రెండు నెలల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఆ సమయం గడచిపోయింది కాబట్టి ఎగ్జిబిటర్లు ఇటీవల మళ్లీ సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాతలు పెట్టిన సమావేశంలో అనవసరంగా ‘పెద్ది’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సినిమాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు నిర్మాతలు ఈ ఇష్యూని వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతున్నారు. మేం చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు పిలిచినా వస్తాం. శుక్రవారం జరిగే సమావేశంలో కలిసి చర్చిస్తాం’ అన్నారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావంతో ఉన్నామని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒకే కుటుంబంలాంటి వారని, అనవసర వివాదాలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సి.కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.