‘నటన ద్వారా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా సృజనాత్మకమైన సంతృప్తినిచ్చేది దర్శకత్వం మాత్రమే’ అన్నారు తరుణ్‌భాస్కర్. గత కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వంతో పాటు నటనకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్లో రాణిస్తున్నారు. తరుణ్‌భాస్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఇటీవలే విడుదలైంది. ఏ.ఆర్.సజీవ్ దర్శకుడు.
ఈ సందర్భంగా శనివారం తరుణ్‌భాస్కర్ పాత్రికేయులతో ముచ్చటించారు. సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, తెలుగు నేటివిటీకి తగినట్లు కథలో చాలా మార్పులు చేశామని, ప్రేక్షకులు ఒరిజినల్ కథగానే ఫీలవుతున్నారని చెప్పారు.
సినిమాలో తాను పోషించిన ఓంకార్ నాయుడు పాత్ర కోసం చాలా హార్డ్‌వర్క్ చేశానని, ముఖ్యంగా గోదావరి యాసలో మాట్లాడే విషయంలో వర్మ అనే మిత్రుడి సలహా తీసుకున్నానని, అక్కడి ఆచార వ్యవహారాలతో పాటు ఫుడ్ కల్చర్ గురించి కూడా తెలుసుకున్నానని తరుణ్‌భాస్కర్ చెప్పారు.
ఇప్పటివరకు తాను పోషించిన పాత్రల్లో ఇదే బెస్ట్ అని, ఈ సినిమాతో నటనపై గౌరవం పెరిగిందన్నారు. దర్శకుడిగా తాను రేసులో వెనకబడ్డట్లు భావించడం లేదని, ఇప్పటికే నాలుగు సినిమాలు చేశానని, ఇంకో సినిమా లైనప్‌లో ఉందని, ఇక ముందు దర్శకత్వంపైనే పూర్తిగా దృష్టి పెడతానని పేర్కొన్నారు.