తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలు కొందరు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ జూలైతో ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అసోసియేషన్‌లోని పలువురు నిర్మాతలు కోరారు. ఈ మేరకు ఛాంబర్ మాజీ అధ్యక్షుడు బసిరెడ్డి, ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ ఆర్.కె.గౌడ్, ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్‌గౌడ్ శనివారం సమావేశాన్ని నిర్వహించారు.
కొందరు తమ సొంత అజెండాతో ఇప్పుడున్న కమిటీనే కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని, మీడియాలో కూడా అదే ప్రచారం చేస్తున్నారని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్మాతలు కోరారు. ఈ విషయమై సోమవారం ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు మెమోరాండం సమర్పించాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.