లంకాప్రతీక్ ప్రేమ్‌కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్‌దాస్ నిర్మాత. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ అతిథిగా పాల్గొన్నారు. టీజర్ విడుదల అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమకు హైదరాబాద్ అనుకూలంగా ఉంది. మా ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. వచ్చే ఐదేళ్లలో చిత్ర నిర్మాణంలో దేశానికి మరో ముంబయిలా మారుతుంది. చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్ పూర్తి సహకారం అందిస్తున్నారు’ అన్నారు. హీరో, దర్శకుడు ప్రతీక్ మాట్లాడుతూ..‘ఇది నా రెండో చిత్రం. మంచి ప్రేమకథతో తెరకెక్కించాం. రొమాన్స్ ఉంటుంది కానీ అసభ్యత లేకుండా జాగ్రత్తపడ్డాం. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక వైష్ణవి, నిర్మాత లంకాకరుణాకర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.