హైదరాబాద్, ఆట ప్రతినిధి : బీసీసీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆతిథ్యమిచ్చిన అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో టీమ్ ‘ఏ’ విజేతగా నిలిచింది. బుధవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టీమ్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో టీమ్ ‘డీ’పై విజయం సాధించింది. తొలుత టీమ్ ‘డీ’ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. మౌల్యరాజ్‌సింగ్ (56), అభినవ్ కన్నన్ (52) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఇషాన్సూద్ (2/59), హనీప్రతాప్ (2/51), అంబరీశ్ (2/28) రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ ‘ఏ’ 41.5 ఓవర్లలో 258/4 స్కోరు చేసింది. అభిజ్ఞాన్ కుందు (72 బంతుల్లో 105 నాటౌట్, 14ఫోర్లు, 2సిక్స్‌లు) సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యాడు. తోషిత్యాదవ్ (2/31), ఇనాన్ (2/50) రెండు వికెట్లు పడగొట్టారు. విజేతగా నిలిచిన టీమ్ ‘ఏ’కు హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్ నవీన్‌రావు ట్రోఫీతో పాటు పతకాలు అందజేశారు.