జగిత్యాల, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): పొట్ట చేతబట్టుకుని ఎడారి దేశాలకు పోతున్న కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా మారిపోయాయి. ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడితే సాయం దొరకని, మృతి చెందితే కుటుంబాలకు బీమా అందని దుస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం 2003లో తీసుకొచ్చిన ప్రవాసీ భారతీయ బీమా పథకానికి 2017లో మార్పులు చేసింది. కానీ ఈ పథకం గురించి నిరక్షరాస్యులైన చాలామంది కార్మికులకు తెలియదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైన అవగాహన కల్పించడంలేదు. దీంతో గల్ఫ్ దేశాల్లోని 14 లక్షల మంది తెలంగాణ కార్మికుల్లో కేవలం 3 లక్షల మంది మాత్రమే బీమా చేయించుకున్నారు. మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉదాహరణకు జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన తోట ధర్మయ్య (50) 12 ఏండ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. ఈ నెల 4న షాపింగ్ పూర్తి చేసి, రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ధర్మయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని వేడుకుంటూ భార్య విమల.. ప్రవాసీ ప్రజావాణిలో విజ్ఞప్తి చేసింది. ధర్మయ్య ప్రవాసీ బీమా పథకంలో పాలసీదారుడిగా లేడని, కాబట్టి కొన్ని ప్రయోజనాలు అందవని అధికారులు చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అశ్రద్ధతోనే కార్మికులకు పీబీబీ పథకంపై సరైన అవగాహన లేదని గల్ఫ్ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. పాస్‌పోర్టు తీసే సమయం నుంచే పథకంపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ పూర్తయిన తర్వాతే ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు.