న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) అంతకంతకూ అభివృద్ధి చెందుతున్నది. దీంతో మానవుల ఉద్యోగాలను ఇది కొల్లగొడుతుందనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ మార్పు ఊహించిన దాని కన్నా వేగంగా జరగబోతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో కల్లోలం వస్తుందని, భారత్ వంటి మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. సేల్స్ఫోర్స్ తాజా అధ్యయనం ప్రకారం, భారత దేశ టెక్ సపోర్ట్ సెక్టార్ ఏఐ టేకోవర్ దిశగా పయనిస్తున్నది.
2027 నాటికి దేశంలోని కస్టమర్ సర్వీస్ (Customer service) కేసుల్లో 50 శాతం కేసులను ఏఐ నిర్వహిస్తుంది. ప్రస్తుతం సుమారు 30 శాతం కేసులను ఏఐ మేనేజ్ చేయగలుగుతున్నది. కేవలం రెండేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రొటీన్, పునరావృతమయ్యే పనులను ఏఐ నిర్వహిస్తుంది. సంక్లిష్టమైన, భావోద్వేగపరమైన, నిర్ణయం తీసుకోవలసిన కేసులను మానవులు చేపడతారు. ఇప్పటికే ఏఐతో పని చేసేవారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, దీంతో కొత్త నైపుణ్యాలను పొందుతున్నామని తెలిపారు.