వేములవాడ రూరల్, నవంబర్ 12 : పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ యువకుడు అక్కడ సరైన ఉపాధిలేక తీవ్ర మనోవేదనకు గురై తనను స్వదేశానికి రప్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస్డేంట్ కేటీఆర్‌ను వేడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లికి చెందిన చెరుకు వంశీ బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్‌గా పనిచేశాడు. గత నెలలో ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు.
ఏజెంట్ మాటలు నమ్మి మంచి పని ఉందని వెళ్లగా, ఆ విధంగా పనిలేకపోవడంతో అక్కడే రూంలో ఉంటున్నాడు. తెలిసిన వారు తినడానికి, ఉండటానికి నివాసం కల్పించారు. ఫ్రీ వీసా కావడంతో వంశీ ఇండియా రావాలంటే ఇక్కడి రూ.లక్ష చెల్లించాలని తెలుపడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే రూ.లక్ష ఖర్చు చేసుకొని దుబాయి వెళ్లగా పనిలేకపోవడంతోపాటు అక్కడ మరో రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో వంశీ మనోవేదనకు గురయ్యాడు.
“నేను దుబాయిలో ఉండలేను.. నన్ను ఆదుకోండి” అంటూ కేటీఆర్‌కు వాట్సాప్ మెస్సేజ్ పంపడంతో స్పందించిన ఆయన, త్వరలోనే స్వదేశానికి రప్పిస్తానని హామీ ఇచ్చారు. వంశీతో పాటు వారి తండ్రి చెరుకు రవీందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.