Producer VA Durai | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత వీఏ దురై (59) కన్నుమూశారు. ఆయన సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపారు. తనకు ఆర్థికంగా సహకరించాలని కోరారు. దర్శకుడు ముత్తురామన్ కొంత సహాయం అందించారని పేర్కొన్నారు.
కొంతకాలం కిందట ఆరోగ్య సమస్యలతో ఓ కాలును తొలగించారు. ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స తర్వాత భారీగా బరువును కోల్పోయి బక్కచిక్కిపోయారు. అయితే, వైద్యం చేయించుకునేందుకు సైతం ఖర్చులు సైతం డబ్బులు లేక ఇబ్బందులుపడ్డారు. రజనీకాంత్, సూర్య తదితర నటులు సైతం ఆర్థికంగా సహాయం అందించారు. అయితే, చికిత్స తీసుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం విషమించి ప్రాణాలు వదిలారు.
వీఏ దురై స్నేహితుడు ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించి ఆయనతో ఫోన్లో మాట్లాడారు. చికిత్స కోసం అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. రజనీ జైలర్ సినిమా షూటింగ్ తర్వాత నిర్మాతను సైతం కలిశారు. అయితే, వీఐ దురై రజనీ నటించిన ‘బాబా’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. నిర్మాత ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న హీరో సూర్యా సైతం సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
వీఏ దురై సూర్య నటించిన ‘పితమగన్’ తెలుగులో శివపుత్రుడు చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతకు ఇద్దరు భార్యలు కాగా.. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, రెండో భార్యకు ఒక కుమార్తె ఉన్నారు. ఆయన గజేంద్ర, పితాగమన్, లవ్లీ, లూటీ, ఎన్నమ్మకన్ను, బాబు, సేతు, కాగిత కప్పల్ తదితర తమిళ చిత్రాలను నిర్మించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు.