Super Star Krishna released First Look of Jai Vittalacharya book | బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఆయన పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. నిజానికి రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరనేది పట్టించుకోరు. ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్న దాన్ని రాజమౌళి సినిమానే అంటారు. ట్రిపుల్ ఆర్ సినిమా చూస్తేనే అది ఎంతవరకు నిజమో అర్థమైపోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తున్నప్పటికీ దాన్ని రాజమౌళి సినిమాగానే చూస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు అంటే రాజమౌళి కానీ.. ఇలాంటి క్రేజ్ అప్పట్లో విఠలాచార్యకు ఉండేది. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న ఆయన.. ఎవరితో సినిమాలు చేసినాకూడా అవన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయన మేకింగ్ మీద సగటు సినీ ప్రేక్షకుడి ఉన్న నమ్మకం అలాంటిది. అందుకే విఠలాచార్య సినిమా అంటే థియేటర్లు హౌస్‌ఫుల్‌తో కళకళలాడేవి. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణాన్ని నవతరానికి పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. ఇందుకోసం జై విఠలాచార్య పేరిట ఒక పుస్తకాన్ని రచించారు. ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు.
జై విఠలాచార్య పుస్తక ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన అనంతరం సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. విఠలాచార్యపై పుస్తకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విఠలాచార్యతో ఉన్న అనుబంధాన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు. విఠలాచార్య దర్శకత్వంలో ఒకే ఒక సినిమా చేశానని పేర్కొన్నారు. ఆ సినిమానే ఇద్దరు మొనగాళ్లు అని.. అదే తన తొలి మల్టీస్టారర్ చిత్రమని చెప్పుకొచ్చారు. తన కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేశానని.. జానపద చిత్రాలు చాలా తక్కువ అని అన్నారు. ఇద్దరు మొనగాళ్లు కాకుండా.. మహాబలుడు, బొమ్మలు చెప్పిన కథ, సింహాసనం మాత్రమే తాను చేసిన జానపద చిత్రాలని చెప్పుకొచ్చారు. విఠలాచార్య గొప్ప దర్శకుడే కాదు.. సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారన్నారు. విఠలాచార్య అనుకున్న బడ్జెట్లో చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారని గుర్తు చేసుకున్నారు.
రచయిత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంలో విఠలాచార్య పెద్ద బాలశిక్ష వంటి వారని కొనియాడారు. తక్కువ బడ్జెట్లో.. పరిమిత లొకేషన్లలో సినిమాలను వేగంగా ఎలా తీయవచ్చో ఆయన చూపించారని అన్నారు. ఇక మూవీ వాల్యూమ్ షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ.. పులగం చిన్నారాయణ రాసిన తొమ్మిదో పుస్తకం జై విఠలాచార్యను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాధారణంగా సినిమాలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తుంటారు.. కానీ కొత్తగా ఉంటుందని మేం మా పుస్తకానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశామని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణతో ఫస్ట్ లుక్ విడుదల చేయించిన జర్నలిస్ట్ వినాయకరావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్లో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?
ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ అన్నింట్లోనూ ఫస్ట్..సాక్ష్యాలు ఇవే
Mahesh: మహేష్ బాబుకి ఇప్పటికీ తెలుగు చదవడం రాదట..!