‘రెగ్యులర్ సినిమాల్లా కాకుండా భిన్నంగా ఉండాలని రవితేజ చెప్పడంతో.. అందుకు తగ్గట్టుగా దర్శకుడు తిరుమల కిశోర్ రాసిన కథ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఆంధ్రలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. నైజాం, సీడెడ్ కూడా దాదాపు దగ్గరకొచ్చాయి. మా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు హ్యాపీగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని నిర్మాత సుధాకర్ చెరుకూరి అన్నారు.
రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నిర్మించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సంక్రాంతి టార్గెట్‌గానే ఈ సినిమాను మొదలుపెట్టాం. కేవలం 65రోజుల్లో పూర్తి చేశాం. సంక్రాంతి సీజన్లో కుటుంబకథలకు మంచి గిరాకీ ఉంటుందని ఈ సంక్రాంతితో మరోసారి రుజువైంది. డైరెక్టర్ దగ్గర్నుంచీ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రమోషన్స్‌కి సహకరించారు. రేపట్నుంచి విజయయాత్రలు చేయబోతున్నాం’ అని తెలిపారు చెరుకూరి సుధాకర్.