‘ఇది మలయాళం రీమేకే అయినా.. యూనివర్సల్‌గా అందరికీ కనెక్టయ్యే కథ. సంస్కృతి విషయంలో మార్పులు చేసుకుంటే చాలు. ఏ భాషలోనైనా ఈ కథను సినిమాగా చేయొచ్చు. తెలుగు సినిమా కాబట్టి గోదావరి జిల్లాల నేపథ్యం తీసుకున్నాను. దాదాపు 60శాతం కథలో మార్పులు చేశాను. చివరి 30 నిమిషాలు, ఒరిజినల్ చూసిన వారికి కూడా కొత్తగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ల ఫైట్ ఒక్కటే కామన్‌గా ఉంటుంది. తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా లాంటి ఒక పెద్ద టీమ్‌తో దర్శకుడిగా తొలి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని దర్శకుడు ఎఆర్ సజీవ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. ‘35 చిన్నకథ కాదు’ లాంటి మంచి సినిమాను నిర్మించిన సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు ఎఆర్ సజీవ్ విలేకరులతో మాట్లాడారు.
‘తరుణ్‌భాస్కర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలని ప్రయత్నించిన నేను, ఆయన్నే డైరెక్ట్ చేస్తాననుకోలేదు. ఈ సినిమా విషయంలో ఆయనిచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. ఫైనల్ కాపీ మాత్రమే చూశారాయన. అవుట్‌పుట్ చూసి ఎంతో మెచ్చుకున్నారు. తరుణ్ భాస్కర్ అనగానే అందరికీ తెలంగాణ స్లాంగే గుర్తొస్తుంది. కానీ ఈ సినిమాలో ఆయన గోదావరి యాస మాట్లాడిన తీరు చూస్తే, అంతా సర్ప్రైజ్ అవుతారు. ఈ స్లాంగ్ పర్ఫెక్ట్గా వచ్చేందుకు తరుణ్ చాలా కష్టపడ్డారు. అద్భుతంగా నటించారు కూడా. ఈషా రెబ్బా పాత్ర తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. గొప్పగా నటించింది’ అని తెలిపారు ఎఆర్ సజీవ్. ఇందులో మ్యూజిక్ కొత్తగా ఉంటుందని, ఏడు పాటలూ ఆకట్టుకుంటాయని, ఈవీవీ సత్యనారాయణ తరహా వినోదాన్ని ఇందులో చూస్తారని, రెండు గంటల 11 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో పూర్తి చేశామని, 39రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని, ఇందులో ఎమోషనల్ డ్రామా దర్శకుడిగా తనకు మంచి పేరు తెస్తుందని ఎఆర్ సజీవ్ నమ్మకం వెలిబుచ్చారు.