‘డిజే టిల్లు’ ఫ్రాంచైజీతో యువతకు అభిమాన హీరోగా అవతరించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సినిమా వస్తుందంటే యూత్‌లో తెలియని అటెన్షన్. సిద్ధు తాజా సినిమా ‘తెలుసు కదా’. నీరజ కోనా దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం సిద్ధు జొన్నలగడ్డ విలేకరులతో ముచ్చటించారు.
ఏడాదిన్నర క్రితమే నీరజ ఈ కథ చెప్పారు. చాలా ఎక్సైట్ అయ్యాను. ‘టిల్లు స్కేర్’ తర్వాత చేయబోయే సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్‌పై ఇంకా వర్క్ చేద్దామని చెప్పాను. కథ, క్యారెక్టరైజేషనే సినిమా విజయానికి ప్రధాన కారణాలని నేను నమ్ముతాను. అలా ఈ కథను లాక్ చేశాం. ఇందులో నా పాత్ర పేరు వరుణ్. తనది బలమైన వ్యక్తిత్వం. తాను మామూలుగా కనిపించినప్పటికీ.. తన ఆలోచనలు మాత్రం రాడికల్‌గా ఉంటాయి. కచ్చితంగా ఆడియన్స్ షాక్ అవుతారు. హ్యూమర్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. మేమేదైతే చూసి ఎక్సైట్ అయ్యామో ఆడియన్స్ కూడా అలాగే ఫీలవుతారని నమ్ముతున్నా.