మదురైలో పుట్టి.. తెలుగింటి సంప్రదాయాల్లో ఒదిగిపోయింది. తెలుగు బుల్లితెర మీద తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ‘హిట్లర్ గారి పెళ్లాం’గా పరిచయమై.. ‘రాధకు నీవేరా ప్రాణం అంటూ.. జీతెలుగు వీక్షకులను అలరిస్తున్నది గోమతి ప్రియ. ఆమె బుల్లితెర ముచ్చట్లు..
తొలిసారి తమిళంలో ఓ సీరియల్ చేశాను. ఆ తర్వాత జీ తెలుగు ‘హిట్లర్ గారి పెళ్లాం’లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘రాధకు నీవేరా ప్రాణం’లో నటిస్తున్నా. వర్మ, అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాల్లో కూడా చేశాను. కానీ.. ఎందుకో సినిమాల కంటే సీరియల్స్ మీదే ఎక్కువ ఆసక్తి నాకు. నా అభిరుచికి తగినట్టే అవకాశాలూ వస్తున్నాయి. మంచిపాత్ర దొరికితే సినిమాల్లో చేయాలని ఉంది. కనిపించేది కొద్దిసేపే అయినా.. కథ మీద ప్రభావం చూపాలి. జనాలకు గుర్తుండిపోవాలి. అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా. చదువు విషయానికొస్తే.. ఇంటర్మీడియట్ వరకు మదురైలో చదివాను. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. క్లాసులో మనమే టాప్. ఆ తర్వాత సంవత్సరం పాటు టెస్టింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశాను.
ఈ సమయంలోనే సరదాగా సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లాను. వరుస అవకాశాలు వచ్చాయి. తమిళంలో రెండు మూడు సీరియల్స్ చేయగానే.. తెలుగు పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. నాన్న మార్కెటింగ్ ఫీల్డ్. నేను, చెల్లి, తమ్ముడు. మా అల్లరి భరించలేక మా అమ్మ తల పట్టుకునేది. మొన్నటి వరకు నాకు తెలుగు వచ్చేదే కాదు. ఎవరైనా చెప్పేది అర్థం చేసుకోవడం, తిరిగి సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉండేది. ‘హిట్లర్’ సీరియల్ సమయంలో తెలుగు పూర్తిగా నేర్చుకున్నాను. ఇప్పుడు గలగలా మాట్లాడుతుంటే.. నన్ను తెలుగమ్మాయి అనే అనుకుంటున్నారు.
ప్రయాణాన్ని ప్రేమిస్తా
ట్రావెలింగ్ అంటే ఇష్టం. షూటింగ్స్ వల్ల ఇంటికి, లొకేషన్‌కు తప్ప ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లాలని, వైవిధ్యమైన రుచులు ఆస్వాదించాలని నా కోరిక. మ్యూజిక్ బాగా వింటాను. డ్యాన్స్ చేస్తాను. ఇంట్లో ఉంటే.. పాటలు పెట్టుకొని స్టెప్పులేస్తూ కాలక్షేపం చేస్తాను. ఇంజినీరింగ్ అయ్యాక ఫ్యాషన్ రంగంలో అవకాశం వచ్చింది. జాబ్ చేస్తూ.. ఖాళీ సమయంలో మాడలింగ్ చేశాను. రెండు పడవల ప్రయాణం ఎందుకో రిస్క్ అనిపించింది. జాబ్ మానేసి మాడలింగ్నే కెరీర్‌గా ఎంచుకున్నాను. ఆ తర్వాత సీరియల్ అవకాశం వచ్చింది. అదే చేస్తున్నాను. లక్ష్యం పట్ల మనకు క్లారిటీ ఉండాలి. జీవితం మనకు ఏం ఇచ్చినా.. సంతోషంగా తీసుకోవాలి అనేది నేను నమ్మే సిద్ధాంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు 2 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. నాకంటూ యూట్యూబ్ చానల్ ఉంది. అందులో కాస్మటిక్స్, వ్లాగ్స్, ఫుడ్.. ఇలా రకరకాల సబ్జెక్టుల గురించి వీడియోలు పెడుతున్నా. మీరూ ఓ లుక్కేయండి.
…?సుంకరి