ఆలేరు టౌన్, సెప్టెంబర్ 5: వైద్యం వికటించడంతో ఒక వ్యక్తి మృతిచెందడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఆలేరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న యాదగిరిగుట్ట మండలం కంటెం గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల ఉదయ్ కుమార్ మృతి చెందాడు. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ కుమార్‌కు నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న సుధాకర్ హోమ్‌కు వెళ్లాడు. తనకు నొప్పి వస్తుందని అతడు డాక్టర్ ప్రతాప్ రెడ్డికి చెప్పగా ఆయన ఇంజక్షన్ ఇచ్చారు.
కొద్దిసేపటికి ఉదయ్ కుమార్ పెట్రోల్ కోసమని సమీపంలోని బంక్‌కు వెళ్లాడు. అయితే.. అక్కడికి వెళ్ళగానే మళ్లీ ఉదయ్‌కు నొప్పి వచ్చింది. దాంతో, అతడు మళ్లీ సుధా నర్సింగ్ హోమ్‌కు వెళ్లి.. డాక్టర్ మరలా తనకు నొప్పి వస్తుందని చెప్పగా.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ ప్రతాపరెడ్డి సూచించారు. ఉదయ్ కుమార్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
ఉదయ్ కుమార్ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధా నర్సింగ్ హోమ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి చేసిన వైద్యం వికటించడంతోనే ఉదయ్ కుమార్ మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయ్ మృతదేహంతో సుధా నర్సింగ్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న న్యూడ్ డెమోక్రసీ నాయకులు ఆస్పత్రికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆలేరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
గతంలో కూడా సుధా నర్సింగ్ హోమ్ లో వైద్యం వికటించి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయని ఆలేరు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని న్యూ డెమోక్రసీ నాయకులు స్పష్టం చేశారు. డాక్టర్ ప్రతాప్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నామని ఆలేరు ఎస్హెచ్ఓ యాలాద్రి తెలిపారు. మృతుడి భార్య కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆస్పత్రి వద్ద ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా స్థానిక ఎస్సై వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.