సీనియర్ హీరో నరేష్ కథానాయకుడిగా ‘శుభకృత్ నామ సంవత్సరం’ పేరుతో తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్నది. ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వంలో డీఆర్ విశ్వనాథ్ నాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు, పవిత్ర లోకేష్, దర్శకులు రామ్ అబ్బరాజు, నిర్మాత రాజేష్ దండా, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గ్లింప్స్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
నరేష్ మాట్లాడుతూ ‘క్యారెక్టర్ నటుడిగా ముందుకెళ్తున్న నాకు లీడ్‌రోల్స్ కూడా మొదలయ్యాయి. అయితే, నేను ప్రతీది క్యారెక్టర్ గానే చూస్తాను. ‘శుభకృత్ నామసంవత్సరం’ కథ నాకు బాగా నచ్చింది. సస్పెన్స్‌తో ట్రావెలయ్యే కంటెంట్ ఉన్న కథ ఇది. టైటిల్ వినగానే అంతా పాజిటివ్‌గా స్పందించారు. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. ఇంకా చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.