Sanjay Dutt | సాధారణంగా హీరోలంటే అభిమానులు పడి చస్తారు. ఎప్పుడెప్పుడు వారిని దగ్గరగా చూసి, ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. అయితే హీరోలు సీరియస్‌గా ఉన్నా, చీవాట్లు పెట్టినా, సెల్ఫీ మాత్రం తీసుకోకుండా ఉండరు. అవసరమైతే ఎన్ని తిట్లైన తింటారు, కొన్నిసార్లు దెబ్బలు కూడా తింటారు. తాజాగా ఇలాంటి ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ అభిమానికి సరదాగా సెల్ఫీ ఇచ్చిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఓ సాయంత్రం సమయంలో రోడ్డుపక్కనే ఉన్న రెస్టారెంట్ దగ్గర నిలబడి ఉన్న సంజయ్ దత్ దగ్గరికి ఓ అభిమాని, సెల్ఫీ ప్లీజ్ అంటూ మొబైల్ పట్టుకుని పరుగెత్తుకొచ్చాడు.
వెంటనే సంజయ్ దత్ అతడిని పక్కకు రమ్మని సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఆ అభిమాని మొబైల్ కెమెరా ఆన్ కాలేదు. అప్పుడు సంజయ్‌దత్ అతడి తల మీద మొట్టికాయ వేసి, నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు. ఈ ఫన్నీ మూమెంట్ చూస్తూ పక్కనే ఉన్నవాళ్లంతా ఘల్లున నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. చాలామంది హీరోలు అభిమానులతో సెల్ఫీ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. కానీ సంజయ్ దత్ మాత్రం ఎప్పుడూ సరదాగా, స్టైలిష్‌గా అభిమానులకు ట్రీట్ ఇస్తుంటారు. సెల్ఫీకి కూడా తనదైన టచ్ ఇవ్వడం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.
ఇక సినిమాల పరంగా చూస్తే, సంజయ్ దత్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు, హిందీ, పంజాబీ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న “అఖండ 2” లో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య – సంజయ్ దత్ మధ్య యాక్షన్ సీన్లు హైలైట్ కానున్నాయి. అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న “ది రాజాసాబ్” లోనూ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో “బాఘీ 4”, “దురంధర్”, పంజాబీ చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం ఆయన సినిమాలతో హవా కొనసాగించబోతున్నారు.