Samantha | మలయాళ సినీరంగంలో (Malayalam cinema) మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక (Hema commission report) అక్కడి ఇండస్ట్రీని కుదిపివేస్తున్నది. మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లలో కనీన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ నటి సమంత సైతం హేమ కమిటీ రిపోర్ట్‌పై తన స్పందన తెలియజేశారు. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించారు. విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) అద్భుతమైన పనితీరును తాను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నట్లు సమంత తెలిపారు. డబ్లూసీసీ వల్లే హేమ కమిటీ నివేదిక ఇవ్వగలిగిందని, చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బయటకు వచ్చాయన్నారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలని సామ్ అభిప్రాయపడ్డారు. వీటికోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అయిననప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని, కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై తగిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్ల్యూసీసీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడించారు. సమంత కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరో సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సైతం హేమ కమిటీ నివేదికపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహిళలు పనిచేసే ప్రతి చోటా ఇలాంటి రిపోర్ట్, కమిషన్లు ఉండాలన్నారు. పలు రంగాల్లో మహిళలు అనేక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా ఖుష్బూ పిలుపునిచ్చారు.
నటుడు విశాల్ సైతం హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించారు. రిపోర్ట్‌ను చదివి షాక్ అయినట్లు చెప్పారు. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమన్నారు. స్త్రీలను ఇబ్బందిపెట్టిన వారికి తగిన శిక్ష పడాలన్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ ఈ విధమైన కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు విశాల్ వెల్లడించారు. 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
అమ్మ అసోసియేషన్‌కు మోహన్‌లాల్ రాజీనామా
హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists) అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఆయనతో పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు నెలల్లోగా కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘అమ్మ’ సంఘంలో సభ్యులుగా ఉన్న దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజారమూడులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక :
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఆ అంశాన్ని స్టడీ చేసేందుకు కేరళ సర్కారు హేమా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమా ఆ కమిషన్‌కు నాయకత్వం వహించారు. నటి శారదతోపాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆ కమిషన్ ఇటీవలే తన నివేదికను సీఎం విజయన్‌కు సమర్పించింది.
మలయాళ చిత్రం పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని .. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని తెలిపింది. ఇండస్ట్రీని కొంత మందితో కూడిన ఒక ‘క్రిమినల్ గ్యాంగ్’ నియంత్రిస్తున్నదని పేర్కొన్న కమిటీ.. లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని వెల్లడించింది. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ మధ్య ఒప్పందం ఉన్నదని కమిటీ నివేదిక ఆరోపించింది. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read..
Matka | వరుణ్ తేజ్ మట్కా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
Rao Ramesh | సూర్య గోల్డ్ కాయిన్ ఇచ్చి నన్ను అభినందించాడు : రావు రమేష్
Actor Darshan | జైల్లో రాజభోగాలు.. నటుడు దర్శన్‌ను బళ్లారి కారాగారానికి తరలించిన అధికారులు