Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం సికిందర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటున్నది. ఇందులో కీలక సన్నివేశాలను సల్మాన్‌ఖాన్‌పై చిత్రీకరించనుండగా.. ఆయన నగరానికి చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఓ భారీ సీన్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తున్నది. సల్లూభాయ్‌తో సహా పలువురు నటీనటులపై సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నది. పుష్ప మూవీతో క్రేజీ హీరోయిన్గా మారిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లోను ఫుల్ బిజీగా ఉన్నది.
వరుసగా రెండుమూడు చిత్రాల్లో నటిస్తున్నది. సికందర్ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ గతంలోనూ పలు చిత్రాల్లో షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఇంతకు ముందు ఫలక్ నుమా ప్యాలెస్‌లో తన సోదరి అర్పితా ఖాన్ వివాహాన్ని 2014లో అట్టహాసంగా నిర్వహించారు. సల్మాన్ ఖాన్ చివరగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్, టైగర్-3 చిత్రాల్లో నటించారు. ఇటీవల సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన బాబా సిద్దిఖీ హత్యకు గురైన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను హతమార్చింది. ఆ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. ఇంటి వద్ద కాల్పులు, బెదిరింపుల తర్వాత నటుడు బయట తక్కువగానే కనిపిస్తున్నాడు. అయితే, షూటింగ్‌కు భారీ భద్రత మధ్య హాజరవుతున్నాడు.