ప్రస్తుత హీరోయిన్లలో నంబర్‌వన్ ఎవరు? అంటే ఎక్కువమంది నుంచి వచ్చే సమాధానం ‘సాయిపల్లవి’. తను ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. తను చేయదగ్గ సినిమా మాత్రమే చేస్తుంది. పరిధి దాటి ప్రవర్తించదు. పద్ధతిగా ఉండే పాత్రలే చేస్తుంది. సాయిపల్లవిని కోట్లాదిమంది ఆరాధిస్తున్నారంటే కారణం.. ఆమె అందం, అభినయం, యాటిట్యూడే.
ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’ సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి, హిందీ ‘రామాయణ్’లో సీత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తానిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి పాత్రలను చేయాలనుకుంటున్నదో వివరించింది.
‘ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోరింగ్‌గా ఉంటుంది. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటిగా మిగలగలం. కొంతవరకూ నేను లక్కీ. చేసిన సినిమాలన్నింటిలో ‘కథానాయిక’ అనదగ్గ పాత్రలే చేశాను. చేసినవన్నీ మంచి కథలే.
నటిగానే కాక, నాట్యతారగా కూడా నాకవి గుర్తింపునిచ్చాయి. కానీ ఇంకా నా ఆకలి తీరలేదు. మంచి పాత్రలు చేయాలి. భిన్నమైన కేరక్టర్స్లో నటించాలి. ముఖ్యంగా కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది. అందులో నేను కామెడీ చేయాలి. నిజానిక్కూడా ఇప్పటివరకూ ఆ తరహా పాత్రలు చేయలేదు. వస్తే మాత్రం వదిలేది లేదు.’ అంటూ చెప్పుకొచ్చింది
సాయిపల్లవి.