ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు తారాలోకం తరలివచ్చింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకను ఆరంభించారు. తారల ఆటపాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ వేడుక ఆసాంతం సందడిగా సాగింది. 2025 సంవత్సరానికిగాను ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
‘తండేల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని స్వీకరించారు అక్కినేని నాగచైతన్య. ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి ఉత్తమ నటిగా రష్మిక మందన్న, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ బృందం, ‘దండోరా’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె.రాబిన్ పురస్కారాలను అందుకున్నారు..
చిరంజీవి(ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు), కమల్‌హాసన్ (పైడి జైరాజ్ జాతీయ పురస్కారం), జయసుధ (అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్), సింగీతం శ్రీనివాసరావు (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్), సి.అశ్వనీదత్(నాగిరెడ్డి-చక్రపాణి ఫిల్మ్ అవార్డు), ఆర్.నారాయణమూర్తి(టీఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డ్), అక్కినేని రమేష్‌ప్రసాద్(రఘుపతి వెంకయ్య అవార్డ్) పురస్కారాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో, ఆ దేశం సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. రాష్ట్రంలో, దేశంలో సినీరంగం అభివృద్ధి అయితే ఎకానమీ పెరుగుతుంది. అది పరిశ్రమకు మేలు చేస్తుంది’ అన్నారు.
‘16ఏండ్ల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని గుర్తింపు ఇది. గద్దర్ లాంటి గొప్ప పర్సనాలిటీ పేరు మీద అవార్డులివ్వడం గొప్ప విషయం. ప్రతి సినిమాకీ నేను వందశాతం ఎఫర్ట్ పెడతాను. కొన్ని వర్కవుట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు. కానీ ఈ తండేల్ రాజ్ పాత్రకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇంత మంచి పాత్ర ఇచ్చిన ‘తండేల్’ టీమ్‌కు థాంక్స్. నా తల్లిదండ్రులు, నా భార్య శోభితలకు కూడా ఈ అవార్డులో భాగం ఉంటుంది’ -నాగచైతన్య మహానటుడు కాంతారావు ‘పీపుల్స్ లెజెండ్, ప్రజావాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఈ అవార్డులిస్తున్నందుకు ఆనందంగా ఉంది. తెలంగాణ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారిలో నంబర్‌వన్‌గా కాంతారావుని చెప్పుకోవాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో ఢీ అంటే ఢీ అన్న గొప్ప నటుడు కాంతారావు. ఎన్టీఆర్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలు పోషించిన గొప్ప నటుడాయన. అలాంటి గొప్ప వ్యక్తి పేరిట స్థాపించిన అవార్డును నాకిచ్చిన ప్రభుత్వానికి థాంక్స్’
– ఆర్.నారాయణ మూర్తి
ఈ అవార్డును నేను చాలా ప్రత్యేకంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తున్నది. ఒకప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ అవార్డును పొందడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నేను ఎంతో దూరం ప్రయాణించాను. ‘గర్ల్‌ఫ్రెండ్’ వంటి సందేశాత్మక చిత్రానికి అవార్డు రావడం..ఈ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి ప్రోత్సాహానిస్తుందని నమ్ముతున్నా. నేను టాలీవుడ్‌కి వచ్చినప్పుడు కూతురిలా ఆదరించారు. ఈ రోజు కోడలిగా మీ ముందున్నా
-రష్మిక మందన్న
పదహారేళ్ల వయసులో నాగేశ్వరరావు ‘శ్రీమంతుడు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చాను. చిరంజీవి నాకు సోదర సమానుడు. మేమిద్దరం ఇప్పటికీ కూడా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాం. గద్దర్ పేరున ఈ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. గద్దర్‌కు ఉన్న లక్షలాది మంది అభిమానుల్లో నేనూ ఒకడినని గర్వంగా చెబుతాను. అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవిస్తూ ఈ అవార్డు నెలకొల్పడం ఆనందంగా ఉంది. నా దృష్టిలో భారతీయ సినిమా అంతా ఒకటే. సినిమాకు ఎలాంటి భాషా భేదాలు లేవు. సినిమా అవార్డులను పునః ప్రారంభించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా -కమల్‌హాసన్
జపాన్, కొరియా తరహాలో..హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా పరిశ్రమకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకు కూడా కేంద్రంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప వంటి చిత్రాలు కనకవర్షం కురిపించి తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. జపాన్, కొరియా దేశాలు ప్రపంచ సినిమాకు దిక్సూచిలా మారాయని, వాటి తరహాలో హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి సినీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, షూటింగ్‌లకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహలు చేస్తున్నదని సీఎం తెలిపారు.