‘ఈసారి పండక్కి సరదా సరదాగా గోలచేద్దాం. మాతో పాటు వస్తున్న సినిమాలన్నీ వినోదాన్ని పంచేవే కావడం విశేషం. ఈ పండుగ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం’ అని అగ్ర హీరో రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల కానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడారు.
ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయికలు అషిక రంగనాథ్, డింపుల్ హయాతి ఆనందం వెలిబుచ్చారు. ఇది ఆద్యంతం వినోదాన్ని పంచే కుటుంబకథాచిత్రమని దర్శకుడు కిశోర్ తిరుమల తెలిపారు. ఇంకా నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా మాట్లాడారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఇదొక ఫ్యామిలీ ఫన్ రైడ్ అని తెలుస్తున్నది.
ఫారిన్ టూర్లో అషికా రంగనాథ్‌ను రవితేజ కలవడం, ప్రేమ కలగడం, డింపుల్ హయాతితో కూడిన అతని వైవాహిక జీవితంలో ఊహించని మార్పులు సంభవించడం ఈ ట్రైలర్లో ఆసక్తిరేకెత్తిస్తున్న అంశాలు. ఇద్దరు స్త్రీలు, రెండు విభిన్నమైన ప్రశ్నల మధ్య నలిగిపోతున్న హీరో వినోదాత్మక భావోద్వేగ ప్రయాణం ఈ సినిమా అని ట్రైలర్ చెబుతున్నది. మొత్తంగా కామెడీ, డ్రామా, ఎమోషన్స్ కలబోతగా అనుబంధాల మధ్య సాగే గందరగోళంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే చక్కటి వినోభరిత చిత్రంగా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.