Rashmika Mandanna | అందంతో, హావభావాలతో కట్టిపడేస్తుంది రష్మిక మందన్న. చారెడు కళ్లు తిప్పితే చాలు.. ఫ్రేమ్ మారేవరకూ ప్రేమ సామ్రాజ్యమే. బుంగమూతి పెట్టుకుని డైలాగ్ చెబితే చాలు.. మాట కచేరీ రక్తి కట్టినట్టే. కాబట్టే ఆమె అభిమానగణంలో క్లాస్, మాస్ తేడా ఉండదు. ఫ్యాషన్ విషయంలో తనకు కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఫ్యాషన్ కంటే సౌకర్యానికే తాను ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నది రష్మిక.
సినిమాల్లో దర్శకుడు చెప్పిందే చేస్తాం, ఆ పాత్రకు తగినట్టు నటిస్తాం. అందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. రీల్ లైఫ్‌కి, రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. తెరపై రకరకాల పాత్రల్లో కనిపించాల్సి వస్తుంది. కానీ నిజ జీవితంలో మనం మనలా ఉండేందుకే ప్రయత్నిస్తాం. అందంగా కనిపించాలనే అనుకుంటారు ఎవరైనా. కానీ అందానికి అలంకరణ జతకలిస్తేనే.. మెరుపులు మెరుస్తాయి. నా వరకు నేను ఆకర్షణ కంటే.. సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తాను. షూటింగ్స్, ప్రత్యేక సందర్భాలు మినహా.. నా ఓటు ట్రౌజర్, టీ షర్ట్ కే.
తెలుగు ప్రేక్షకుల ఆదరణ జీవితాంతం మర్చిపోలేనిది. ‘పుష్ప’ తర్వాత వాళ్లకు మరింత దగ్గరయ్యాను. ఎక్కడికి వెళ్లినా తమ అమ్మాయిలానే చూస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌పైనా
దృష్టిపెట్టాను. ‘పుష్ప2’తో శ్రీవల్లిగా మరోసారి తెరపై కనిపించే రోజు కోసం మీతోపాటు నేనూ ఎదురు చూస్తున్నాను.
సెలెబ్రిటీలకే కాదు, ప్రతి ఒక్కరికీ ఫిట్నెస్ అవసరం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంపై శ్రద్ధ పెడతాను. వ్యాయామం, యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చేస్తున్న పనులపై దృష్టి పెట్టవచ్చు. తగినంత తినొచ్చు, తగినన్ని నీళ్లు తాగొచ్చు. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని నేను చెప్పను. ఎవరి అభిరుచిని బట్టి, సౌకర్యాన్ని బట్టి వారు వ్యాయామాన్ని ఎంచుకోవాలి.
పబ్లిసిటీ కోసం సెలెబ్రిటీలపై ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తుంటారు. వాటివల్ల మేం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోను. సరదాగా ఉన్నంతవరకూ ఫర్వాలేదు. మితిమీరిన ఊహాగానాలు ఎప్పుడూ మంచివి కావు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యం.
మన ప్రపంచంలో మనం బతుకుతున్నా ఏదో ఓ వంకతో, ఎవరో ఒకరు మనపై బురద చల్లాలని చూస్తారు. ఆరు నూరైనా మనసు చెప్పిన మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నా. చుట్టూ రాళ్లేసేవాళ్లు ఉన్నప్పుడు తల వంచుకుని ముందుకు సాగడమే ఉత్తమ మార్గం.
“Rashmika Mandanna | ఎట్టకేలకు రష్మిక హిట్టు కొట్టేసింది..!”