Rashmika Mandana | రష్మిక అంటే వెలుగు రేఖ అని అర్థం. తన పేరు మాదిరిగానే ఈ కన్నడ కస్తూరి ప్రభ దేశమంతా వెలిగిపోతున్నది. పశ్చిమ కనుమల్లో కొలువైన సుందర కూర్గ్ ప్రాంతం నుంచి ఏడేళ్ల క్రితం ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ భామ తారాపథంలో దూసుకెళ్లిన వైనం నిజంగా స్ఫూర్తిదాయకమే. యువతరం ఈ అమ్మడిని నేషనల్ క్రష్ అంటూ అభివర్ణిస్తారు. ‘పుష్ప’లో శ్రీవల్లిగా, ఇటీవల విడుదలైన ‘యానిమల్’లో గీతాంజలి పాత్ర ద్వారా జాతీయ స్థాయిలో ఈ భామ తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది.
ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో అగ్ర హీరోలతో జోడీ కడుతున్నది. శనివారంతో ఈ సొగసరి సినీ రంగంలో ఏడేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణమంతా ఓ కలలా అనిపిస్తుంది. అసలు ఇంతదూరం ఎలా వచ్చానోనని ఆశ్చర్యం కలుగుతుంది. ఏదిఏమైనా నా కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. మంచి మనసున్న వ్యక్తుల పరిచయం..వారితో చేసిన ప్రయాణం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా’ అని రష్మిక మందన్న పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. రష్మిక మందన్న ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉంది.