తన సినీ కెరీర్లో గత ఏడాది ఎంతో ప్రత్యేకమని, విభిన్న భాషల్లో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ హిందీ ‘కాక్టెయిల్-2’లో నటిస్తున్నది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భిన్న భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించడంతో నటిగా మరింత పరిణితి చెందానని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘గత ఏడాది అన్నీ కలిసొచ్చాయి. సినిమాల పరంగా ఎందరో కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడంతో పాటు వారి నుంచి ఫిల్మ్‌మేకింగ్‌కు సంబంధించిన గొప్ప విషయాల్ని నేర్చుకున్నా. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని, మన మూలాల్ని మర్చిపోకూడదని అర్థం చేసుకున్నా.
అన్నింటికంటే ముఖ్యంగా జయాపజయాలతో సంబంధం లేకుండా మనదైన వ్యక్తిత్వం, అంకితభావంతో ముందుకుసాగాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది రష్మిక మందన్న. ‘కాక్టెయిల్-2’ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుందని, ఇప్పటివరకూ ఈ తరహా పాత్ర చేయలేదని తెలిపింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మైసా’, హిందీలో ‘కాక్ టెయిల్-2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.