Sourav Ganguly Biopic | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయెపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ బయెపిక్కి సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై రణ్‌బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి పలువురు నటుల పేర్లు వినిపించాయి అయితే చివరిగా ఆ అవకాశం బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుకి దక్కింది. గంగూలీ బయోపిక్‌లో రాజ్ కుమార్ రావుని చిత్రయూనిట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.
మరోవైపు ఈ ప్రాజెక్ట్ గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, తన బయోపిక్ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అదే ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల కావచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. రాజ్‌కుమార్ రావు తన పాత్రను పోషించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, సినిమాకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని గంగూలీ చెప్పారు.
రాజ్‌కుమార్ రావు కూడా ఈ పాత్రపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. గంగూలీ గారి బయోపిక్‌లో నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత. కాస్త ఆందోళనగా ఉంది, కానీ చాలా సరదాగా కూడా ఉంటుందని అనుకుంటున్నాను” అని ఆయన తెలిపారు. గంగూలీ బెంగాలీ కావడంతో, ఆ భాషను నేర్చుకుంటున్నానని, తన భార్య పత్రలేఖ (ఆమె బెంగాలీ) సహాయం తీసుకుంటున్నానని రాజ్‌కుమార్ రావు వెల్లడించారు. ఇది పాత్రకు మరింత సహజత్వాన్ని తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో, లవ్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఈ బయోపిక్‌లో గంగూలీ బాల్యం, క్రికెట్ ప్రస్థానం, కెప్టెన్‌గా ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను చూపించనున్నారు. రాజ్‌కుమార్ రావు వంటి విలక్షణ నటుడు గంగూలీ పాత్రలో నటించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
గంగూలీ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. భారత్ తరపున అతడు 113 టెస్టులు మరియు 311 వన్డేలు ఆడాడు. లెప్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన గంగూలీ అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. 2008లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడిగా.. తరువాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
Read More