SSRajamouli cameo in DeathStranding2 | ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అంతర్జాతీయ గేమింగ్ ప్రపంచంలో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. ప్రముఖ జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న “డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్” (Death Stranding 2: On the Beach) వీడియో గేమ్‌లో రాజమౌళి, అతడి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ అతిథి పాత్రలు (క్యామియో) పోషించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. ఈ గేమ్‌కు ముందుగానే యాక్సెస్ పొందిన కొందరు ప్లేయర్లు, గేమ్‌లో రాజమౌళిని “ది అడ్వెంచరర్” (The Adventurer) గా, కార్తికేయను “అడ్వెంచరర్’స్ సన్” (Adventurer’s Son) గా గుర్తించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.
రాజమౌళి, హిడియో కొజిమా మధ్య అనుబంధం 2022లో ‘RRR’ చిత్రం జపాన్‌లో విడుదలైన సమయంలో మొదలైంది. అప్పట్లో రాజమౌళి కొజిమా స్టూడియోను సందర్శించి, అక్కడ ఉపయోగిస్తున్న 3D క్యారెక్టరైజేషన్ టెక్నాలజీని ఆసక్తిగా పరిశీలించారు. వారిద్దరి మధ్య ఈ పరిచయమే ఇప్పుడు “డెత్ స్ట్రాండింగ్ 2″లో వారి క్యామియోలకు దారితీసిందని తెలుస్తోంది.
ఈ గేమ్ 2025 జూన్ 26న PlayStation 5లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాజమౌళి, కార్తికేయ పాత్రలు కేవలం అతిథి పాత్రలే అయినప్పటికీ, అవి గేమ్ కథనంలో భాగంగానే రూపొందించబడ్డాయని సమాచారం. తెలుగు సినిమా దర్శకుడు అంతర్జాతీయ గేమింగ్ ప్రపంచంలో భాగం కావడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారతీయ కళాకారులకు అంతర్జాతీయ వేదికపై దక్కుతున్న గుర్తింపుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
#SSRajamouli cameo in #DeathStranding2 pic.twitter.com/FzmpLEwtEd
— TFI Sena 🎥⚔️ (@tfi_sena) June 24, 2025
Read More